మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు ప్యానల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేసింది. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్, ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ ను ఎదుర్కొనేందుకు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా ఇటీవలే తన ప్యానల్ ను ప్రకటించారు.
ఈరోజు నామినేషన్ వేసేందుకు తన ప్యానల్ సభ్యులతో భారీగా ర్యాలీ నిర్వహించి ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 01.19 గంటలకు మంచు విష్ణుతోపాటు ఆయన ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేయడానికి ముందే తన ప్యానల్ తరఫున ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్న బాబూ మోహన్, ఉపాధ్యక్షులుగా పోటీపడుతున్న మాదాల రవి, పృథ్వీరాజ్ లను కలిశారు.
అనంతరం ర్యాలీగా ఫిలిం ఛాంబర్ ఆవరణకు చేరుకున్నారు. మొదటగా ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఉన్న దాసరి నారాయణరావు విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఇరు పక్షాలూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నామినేషన్ హడావుడితో ఫిలిం ఛాంబర్ ఆవరణలో సందడి నెలకొంది. మంచి ముహూర్తం చూసుకుని మంచు విష్ణు నామినేషన్ వేసినట్టు సమాచారం.
Must Read ;- మా ఎన్నికల కోసం మంచు విష్ణు ప్యానల్ ఇదే











