సినిమా రాజకీయం అనేది రాజకీయ సినిమాని చూపించేస్తోంది. నాలుగు రోజులుగా సినిమా రాజకీయం వేడెక్కింది. ఓ పక్క మా ఎన్నికలు, ఇంకో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగం.. నోరు పారేసుకోడాలతో వాళ్లకేమీ కాలేదుగానీ జనం బుర్ర మాత్రం వేడెక్కుతోంది. మా ఎన్నికలకు పోటీపడుతున్న ప్రధాన ప్యానల్స్ నామినేషన్లు కూడా వేశాయి. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఈ సమయంలో ఎవరు ఏం మాట్లాడినా బూతద్దంలో చూడటం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం ఉండకూడదని తను కోరుకుంటున్నట్టు మంచు విష్ణు విలేకర్ల సమావేశంలో అన్నారు. అలాగే మహిళలకు ఆయన పెద్ద పీట వేయడం వరకూ ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. తనను ఎన్నికల నుంచి తప్పుకోవాలని ఒకరు ఫోన్ చేసిన తర్వాతే నాన్న రంగంలోకి దిగినట్టు చెప్పుకొచ్చారు. దానికి కూడా ఎవరూ అభ్యంతరం చెప్పలేదుగానీ ఏపీ సీఎం తనకు బావ అవుతారని, మాజీ సీఎం చంద్రబాబు తనకు బంధువు కావడంతో పాటు, తన తండ్రికి స్నేహితుడు కూడా అవుతాడని చెప్పడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మోహన్ బాబు కూడా ఓ ఇంటర్యూలో తనకు రాజశేఖర్ రెడ్డిని పరిచయం చేసింది చంద్రబాబేనని అన్నారు. విష్ణు ఈ మాట అన్నా నిజానికి వీరి స్నేహం చెడిపోయి చాలా కాలమైంది. అప్పట్లో హెరిటేజ్ తో వీరిద్దరి అనుబంధం ఉందనే వార్తలు వచ్చినా ఇద్దరి మధ్యా రాజకీయపరమైన విభేదాలో, వ్యక్తిగతమైన విభేదాలో తెలియదుగానీ దూరం మాత్రం పెరిగింది. మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు.
క్రమశిక్షణ అనే పదానికీ, స్నేహం అనే పదానికీ అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు అంటూ ట్విట్టర్ లో మోహన్ బాబు విమర్శల వర్షం కురిపించారు. అలా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. కాబట్టి ఇద్దరి మధ్యా స్నేహం అనే ప్రస్తావన లేనే లేదు. ఆతర్వాత వైఎస్. రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు కదా అలా అనుకోవాలేమో. పోనీ బంధుత్వం ఉందా అంటే అలాంటి బంధుత్వం కూడా లేదు. తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం ఆపేసిందంటూ మోహన్ బాబు ఆందోళన చేపట్టిన సందర్బాలూ ఉన్నాయి.
ఇక విష్ణు సీఎం జగన్ తనకు బావ అంటూ సంబోధించారు. వైఎస్ఆర్ సోదరుడు కుమార్తె వెరోనికా రెడ్డిని విష్ణు పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబుకూ, మోహన్ బాబుకూ ఇప్పుడు పొసగడం లేదు. బహుశా కులపరంగా బంధుత్వం అనుకోవాలేమో. మా ఎన్నికల ప్రచారం వేగం పెరిగింది కాబట్టి ఇలాంటి బంధుత్వాలు, స్నేహాల ప్రస్తావన లేకుండా మంచు విష్ణు మాట్లాడితే బాగుండేదేమో. అసందర్భంగా ఈ ప్రస్తావన వచ్చినట్టుంది. ఓ పక్క రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం కొంత నిప్పు రాజేసింది. ఎవరు ఏం మాట్లాడినా బూతద్దంలో చూసేవారు ఎక్కువయ్యారు. ఇరువర్గాలూ ఆచితూచి మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటే మంచిది.
Must Read ;- పవర్ స్టార్ వ్యాఖ్యలపై వాడివేడిగా ఎదురుదాడులు











