కడప జిల్లా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా. వైసీపీకి ఈ జిల్లా కంచుకోట కిందే లెక్క. 2019 ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంటు సీట్లను గెలిచిన వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేసిన వైనం వైసీపీకి కలసివచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అదే జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇటీవలే చనిపోయిన తన పార్టీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమని సుధనే వైసీపీ బరిలోకి దించింది. అయితే చనిపోయిన ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన వ్యక్తినే బరిలోకి దించితే.. విపక్షాలేవీ పోటీ చేయరాదన్న సంస్కృతిని గౌవరించిన టీడీపీ, జనసేనలు పోటీకి దూరంగా ఉండనున్నట్లుగా ప్రకటించేశాయి. అయితే జనసేత మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం పోటీ నుంచి తప్పుకునేది లేదని ప్రకటించింది. అంతేకాకుండా అభ్యర్థి ఎంపిక పట్ల కూడా ఆ పార్టీ కసరత్తులు చేస్తోంది.
అసలు బీజేపీ బలమెంత?
2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఈ పోరులో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకటసుబ్బయ్య రికార్డు స్థాయిలో 44 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై జయకేతనం ఎగురవేశారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేల్ లో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల ఓట్లు గంపగుత్తగా వెంకటసుబయ్యకే పడ్డాయి. దీంతోనే ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారని చెప్పాలి. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తిరువీధి జయరాములుకు కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోలైన ఓట్లలో బీజేపీకి పడిన ఓట్ల శాతం 0.47 శాతం మాత్రమే. బీజేపీ కంటే బీఎస్పీ ఎక్కువ ఓట్లు సాధించగా.. నోటాకు పడిన ఓట్లు కూడా బీజేపీ కంటే ఎక్కువే. నోటాకు ఇక్కడ 2004 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం జనసేనతో మైత్రి కొనసాగిస్తున్న బీజేపీ.. బద్వేల్ లో సత్తా చాటాలని ఆశించడంలో తప్పు లేదు గానీ.. జనసేన కూడా పోటీ చేయమంటూ ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ పోటీకి సిద్ధపడుతున్న వైనం ఆసక్తి రేకెత్తించేదే.
బీజేపీ లెక్క ఇదే
బద్వేల్లో చనిపోయిన ఎమ్మెల్యే సతీమణినే పోటీకి దింపుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏ ఉద్దేశ్యం ఉన్నా.. సంప్రదాయాన్ని గౌరవిస్తూ టీడీపీ, జనసేనలు బరి నుంచి తప్పుకున్నాయి. అయితే ఆ రెండు పార్టీలకు చెందిన ఓట్లు తనకే పడతాయన్న భావనతో బీజేపీ ఉన్నట్లుగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి గతంలో 50748 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థికి 95,482 ఓట్లు వచ్చాయి. వెరసి టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి ఏకంగా 44,7734 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా కొంతమేర గాలి వీస్తున్నా.. టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే.. వైసీపీ మెజారిటీ తగ్గిపోవడమో.. లేదంటే టీడీపీ చేతిలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడమో జరిగేది. అలా కాకుండా బరి నుంచి టీడీపీ వైదొలగితే ఆ పార్టీ ఓట్లు బీజేపీకి ఎందుకు పడతాయి? ఈ లాజిక్నే మిస్సైన బీజేపీ పోటీకి సై అంటోంది. ఒకవేళ టీడీపీ ఓట్లు బీజేపీకి పడినా.. 2019 లెక్కలను చూస్తే.. వైసీపీదే విజయం కదా. మరి ఏ లెక్కలను అంచనా వేసి బీజేపీ బరిలోకి దిగుతోందన్న వాదనలపై భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బీజేపీతో జనసేన కటీఫ్ పక్కా











