సినీ హీరోగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనానిగా మారిపోయారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా సాగుతున్నారు. అయితే గతంలో మాదిరి దూకుడు తత్వాన్ని పవన్ పూర్తిగా వదిలేశారు. ముఖంలో ఏమాత్రం కోపాగ్ని కనిపించకుండా.. నవ్వుతూ తుళ్లుతూ.. ప్రశాంత వదనంతో ఆయన వైరి వర్గాలపై విమర్శలను సంధిస్తున్నారు. వైసీపీ నేతలు తనపై తీవ్రమైన ఆరోపణలు చేసినా.. వాటికి కౌంటర్లు ఇస్తున్న సమయంలోనూ పవన్ లో గతంలో మాదిరి భీకర రూపం కనిపించలేదు. గతంలో మాదిరిగా ఉర్రూతలుగిపోలేదు. గతంలో మాదిరిగా తనదైన శైలి కోపాన్ని తన ముఖంలో కనిపించనీయలేదు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన పవన్‌లో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. ఈ మార్పును చూసిన జనసైనికులతో పాటుగా జనం కూడా అమితాశ్చర్యానికి గురయ్యారని చెప్పక తప్పదు.
గతంలో ఊగిపోయిన జనసేనాని
2014 ఎన్నికలకు ముందుగానే జనసేనను స్థాపించిన పవన్.. పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఊగిపోయిన వైనం తెలిసిందే. ఆ తర్వాత టీడీపీతో పొత్తు తెంచుకున్న తర్వాత గుంటూరులో నిర్వహించిన సభలో పవన్ వీరావేశం ఓ రేంజిలో కనిపించింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతి, కాకినాడల్లో నిర్వహించిన సభల్లోనూ పవన్ మార్కు వీరావేశం జనసైనికులను అలరించిందనే చెప్పాలి. అంతగా వీరావేశం చూపినా.. నాడు పవన్ కామెంట్లలో ఆవేశం తప్పించి నిర్మాణాత్మక విమర్శలు పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఏదో ఒకటో, రెండో పవర్ ఫుల్ డైలాగులు సంధించి మిగిలినదంతా పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపేలా ఊగిపోయేవారు. పవన్‌లోని వీరావేశాన్ని చూసి జనసైనికులు కేరింతలు కొట్టేవారు. ఈ తరహా ఊగిపోవడంతో పెద్దగా ప్రయోజనం లేదని గ్రహించారో, ఏమో తెలియదు గానీ.. పవన్ తన స్టైల్‌ను పూర్తిగా మార్చేశారు.
నవ్వుతూనే స్ట్రాంగ్ వార్నింగ్‌లు
బుధవారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుధీర్ఘంగానే ప్రసంగించిన పవన్.. ఎక్కడా తన పాత స్టైల్ ను కనిపించనీయలేదు. ఆద్యంతం ప్రశాంత చిత్తంతోనే సాగిన పవన్.. తన ముఖంలో కోపం అన్న మాటే కనిపించకుండా వ్యవహరించారు. అదే సమయంలో వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ లు కూడా ఇచ్చారు. ఇప్పుడు 151 సీట్లు వచ్చిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు వస్తాయేమో, వైసీపీ హయాంలో అసెంబ్లీ కౌరవుల పాలనను తలపిస్తే.. తాము అధికారంలోకి వచ్చాక పాండవుల పాలనను చూపిస్తామని కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటానికైనా, ఇంకే రూపంలో పోరాటానికైనా తాను సిద్ధమేనని, తాను భయపడటం, వెనక్కు తగ్గడం అన్న మాటే ఉండదని, బయటకు రా పెట్టుకుందాం అని, తాట తీస్తాం అని.. ఇలా చాలా ఘాటు వ్యాఖ్యలే చేసిన పవన్.. ఆ సందర్భంగానూ ఊగిపోకుండా ప్రశాంతంగానే నిలబడ్డారు. వైసీపీ పాలన సాగుతున్న తీరును ఆయన తనదైన శైలి నిర్మాణాత్మక విమర్శలతో ఎండగట్టారు. కుల జాడ్యాన్నా అందరూ విడనాడాలని, వైసీపీ మాత్రం దానిని పెంచి ప్రోత్సహిస్తోందని చెప్పిన పవన్.. తనను ఓడించిన ఓటర్లకు కూడా తనదైన శైలి విజ్ఞప్తులు చేశారు. జనసేనను గెలిపించి చూడండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని కూడా పవన్ వ్యాఖ్యానించిన వైనం కూడా ఆకట్టుకుందనే చెప్పాలి. అంతేకాకుండా వైసీపీ నేతలపై తాను చేసిన ఘాటు వ్యాఖ్యలను వివరించి మరీ మరోమారు అవే వ్యాఖ్యలను పదే పదే చేసినా కూడా పవన్ లో పెద్దగా ఉక్రోశం కనిపించలేదు. మొత్తంగా ఈ ప్రసంగంతో పవన్ తన స్టైల్ ను పూర్తిగా మార్చేసుకున్నట్లుగా చెప్పకనే చెప్పేశారు.
Must Read ;- పీకే వర్సెస్ పోసాని.. హద్దులు దాటేసింది











