స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పు మా పక్షమేనంటూ ఏపీలోని అధికార పార్టీ చంకలు గుద్దుకున్నా.. ఒకటి, రెండు చోట్ల విపక్షాలు కూడా సత్తా చాటాయి. అలా విపక్షాలు సత్తా చాటిన ప్రాంతాలు ఎక్కడో మారు మూల ఉంటే వైసీపీ పట్టించుకునే వారు కాదేమో. అలా కాకుండా జగన్ తాడేపల్లి పాలెస్ కు కూతవేటు దూరంలో.. రాజదాని అమరావతి పరిధిలో.. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గం మంగళగిరి పరిధిలో.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అసలు బలమే లేదంటూ వైసీపీ ప్రచారం చేసిన నియోకజవర్గంలోని దుగ్గిరాలలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ సత్తా చాటింది. 18 ఎంపీటీసీ స్థానాలున్న దుగ్గిరాల మండలంలో 9 స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. మరో స్థానంలో టీడీపీ మద్దతుతో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మంగళగిరిలో తమకు ఎదురే లేదన్నట్లుగా విర్రవీగిన వైసీపీ కేవలం 8 స్థానాలకు పరిమితమైపోయింది. వెరసి ప్రజా తీర్పు అనుకూలంగా వచ్చిన టీడీపీకి ఎంపీపీ పదవి దక్కాల్సి ఉంది. అయితే నామినేషన్లు, పోలింగ్ లో చూపిన మాదిరే ఇక్కడ కూడా వైసీపీ కండబలాన్నే చూపింది. దుగ్గిరాల ఎంపీపీని కైవసం చేసుకుంది.
మైనారిటీ వస్తే.. మెజారిటీ రాలేదట
దుగ్గిరాల ఎంపీపీ పదవిని ఎలాగైనా దక్కించుకునేందుకు వైసీపీ తనదైన మార్కు ప్లాన్ వేసింది. జనసేన తరఫున గెలిచిన సింగిల్ సభ్యుడిని తన వైపునకు లాక్కుంటే కూడా వైసీపీ బలం టీడీపీ బలంతో సరిసమానం అవుతుంది. అందుకని జనసేన అభ్యర్థిని అలా పక్కనపెట్టేసి.. టీడీపీ సభ్యులనే లాగే యత్నం చేశారు. అయితే దుగ్గిరాల టీడీపీకి కంచుకోట కదా. అలా ఒకరిద్దరు టీడీపీ సభ్యులు వైసీపీ వైపు తిరిగే అవకాశాలు కనిపించలేదు. ఈ క్రమంలో మొత్తంంగా టీడీపీ సభ్యులతో పాటు జనసేన సభ్యుడు కూడా ఎంపీపీ ఎన్నికకు హాజరు కాకుండా ప్లాన్ రచించారు. ఈ దిశగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యే ఆళ్ల ఏం ప్లాన్ రచించారో గానీ.. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యులతో పాటు జనసేన సభ్యుడు కూడా హాజరు కాలేదు. అంతేకాకుండా మైనారిటీలో ఉన్నా కూడా వైసీపీ అభ్యర్థి చేత ఎంపీపీ పదవి కోసం ఆళ్ల నామినేషన్ వేయించేశారు. ఇక టీడీపీ సభ్యులు గానీ, జనసేన సభ్యుడు గానీ హాజరే కాకుంటే.. వారెలా నామినేషన్ దాఖలు చేస్తారు. వెరసి అధికారిక లెక్కల ప్రకారంఎంపీపీ పదవి కోసం సింగిల్ నామినేషన్.. అది కూడా వైసీపీ నుంచే పడింది. ఎంపీపీ పదవికి నామినేషన్ల గడువు కూడా ముగిసిందని అధికారులు ప్రకటించారు. గడువు ముగిసేలోగా ఒకే ఒక్క నామినేషనే వచ్చిందని కూడా తేల్చేశారు. అంటే.. ఎంపీపీ పదవి వైసీపీ ఖాతాలో పడినట్టే కదా.
కోరం లేకుంటే వాయిదా తప్పదుగా
అన్నీ పకడ్బందీగానే ప్లాన్ చేసుకున్నా.. వైసీపీ అభ్యర్థి ఎంపీపీ సీటుపై కూర్చునే అవకాశం మాత్రం శుక్రవారం కుదరలేదు. ఎందుకంటే.. వైసీపీ సభ్యులు 8 మందే. 10 మంది టీడీపీ, జనసే సభ్యులు. మరి జనసేన, టీడీపీ సభ్యులు రాకుంటే.. కోరం ఎలా హాజరైనట్లు? ఇక్కడే వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది. కోరం లేని కారణంగా ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా దుగ్గిరాల ఎంపీడీఓ ప్రకటించారు. శనివారం కూడా ఎంపీపీ ఎన్నికకు కసరత్తు చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే.. శనివారం కూడా టీడీపీ, జనసేన సభ్యులు హాజరుకాకపోతే.. శనివారం కూడా కోరం లేనట్టే కదా. మరి అప్పుడేం చేస్తారు? మళ్లీ వాయిదా వేయాల్సిందే కదా. వైసీపీ ఎంత బలప్రయోగం చేసినా కూడా కోరం లేకుండా ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయడం కుదరదు. మరి టీడీపీ, జనసేన సభ్యులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారా? లేదంటే ఎలాగూ అక్కడికి వెళితే.. వైసీపీ దౌర్జన్యానికి దిగుతుందని భావించి టీడీపీ, జనసేన అభ్యర్థులే వ్యూహాత్మకంగా గైర్ఝాహజరయ్యారా? అన్న దిశగా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు వైసీపీ అన్నీ సిద్ధం చేసుకున్నా.. ఎక్కడో ఏదో మూల ఆ పదవి టీడీపీకే దక్కే అవకాశాలే ఉన్నాయన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.