అప్పుడెప్పుడో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆనాటి అధికార పార్టీ టీడీపీ భారీ ఎత్తున నేతలను మోహరించిందని ఆరోపణలు గుప్పించిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అంతకుమించి అన్నట్లుగా భారీ సంఖ్యలో నేతలను రంగంలోకి దించుతున్నారు. కడప జిల్లా సీఎం జగన్ సొంత జిల్లా కదా. అందులోని బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున వైసీపీ ఓడిపోతే.. జగన్‌కు ఎంత అవమానం? అందుకే కాబోలు ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఓ జిల్లా పరిషత్ చైర్మన్, ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన మరో ఇద్దరు కీలక నేతలను కూడా జగన్ బరిలోకి దించుతున్నారు. మొత్తంగా 7 మండలాలున్న బద్వేల్ ఉప ఎన్నికలో గెలుపు కోసం జగన్ ఏకంగా 13 మంది హేమాహేమీ నేతలను.. అది కూడా పొరుగు జిల్లాల నేతలను కూడా బరిలోకి దింపేశారు. ఈ బృందానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వం వహిస్తారని కూడా జగన్ ప్రకటించారు.
జాబితాలో ఉన్న నేతలు వీరే
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పనిచేయనున్న ఈ కమిటీలో కడప జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జీ మంత్రి హోదాలో ఉన్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారట. వీరికి అదనంగా ఒక్కో మండలం బాధ్యతలను ఒక్కో కీలక నేతకు అప్పగించారు. బద్వేల్ మండలానికి చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలసపాడు మండలానికి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి, పోరుమామిళ్ల మండలానికి ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, గోపవరం మండలానికి చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. ఇక కాశినాయన మండలానికి మాజీ ఎమ్మల్యే, ఇటీవలే కడప జడ్పీ చైర్మన్‌గా నియమితులైన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బి.కోడూరు మండలానికి పార్టీకి చెందిన రఘురాంరెడ్డి, అట్లూరు మండలానికి రవీంద్ర రెడ్డిలను నియమించారు. ఇక బద్వేల్ మునిసిపాలిటీకి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించారు. మొత్తంగా కమిటీలో ఐదుగురు, 7 మండలాలకు ఏడుగురు కీలక నేతలు, మునిసిపాలిటీకి మరొకరు మొత్తంగా 13 మంది కీలక నేతలను జగన్ రంగంలోకి దించేశారు.
పెద్దిరెడ్డిది గోల్డెన్ లెగ్గట
బద్వేల్ ఉప ఎన్నికకు కడప జిల్లాకు చెందిన మంత్రికో, ఎంపీకో బాధ్యతలు అప్పజెప్పడానికి బదులుగా చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు ఎమ్మెల్యే.. జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించడం వెనుక ఓ కారణముందట. అదేంటంటే.. రాజకీయాల్లో సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డికి పోల్ మేనేజ్ మెంట్ బాగా తెలుసట. అంతేకాకుండా పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే.. అన్ని విజయాలే దక్కాయట. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు పంచాయతీ, ఇటు పరిషత్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటడానికి కూడా కారణమిదేనట. అందుకే వైసీపీకి పెద్దిరెడ్డి లెగ్ గోల్డెన్ లెగ్ గా మారిందట. ఇదే అంశాన్ని ప్రస్తావించిన జగన్.. బద్వేల్ ఉప ఎన్నికకు ఏర్పాటు చేసిన కమిటీకి పెద్దిరెడ్డికే నేతృత్వం వహిస్తారని చెప్పారట.
Must Read ;- బద్వేల్ బైపోల్‌లో విక్టరీ టీడీపీదేనా?