ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 25 మంది ఎంపీలను ఇస్తే… కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధించుకుని వస్తానని ఎన్నికలకు ముందు ప్రగల్బాలు పలికిన జగన్… ఎన్నికలు ముగిసి తాను సీఎం కుర్చీలో కూర్చోగానే మాట మార్చేశారు. సీఎంగా తన తొలి ఢిల్లీ పర్యటనలోనే ఈ విషయాన్ని తేల్చేసిన జగన్… ఇప్పుడు అసలు ప్రత్యేక హోదాపై మాట్లాడటమే మానేశారనే చెప్పాలి. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తన సొంత ఎజెండాతోనే వెళుతున్నారని, కేంద్రం వద్ద ప్రత్యేక హోదా ప్రస్తావనే ఉండటం లేదని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే ఉన్నాం
ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధనపై పూర్తిగానే చేతులు ఎత్తేసినట్టుగా… తాజాగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయతో ఎప్పుడో ఓ సారి మంచి జరుగుతుందని అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధన దిశగా తన ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ప్రస్తావించిన సందర్భంగా జగన్ నోట నుంచి ఈ మాట వినిపించింది. దేవుడి దయతో ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యేక హోదా వస్తుందని తాను అనుకుంటున్నానని జగన్ చెప్పారు. ఇక ప్రత్యేక హోదాపై ఎప్పటిమాదిరిగానే ఈ సారి కూడా జగన్ … విపక్షం టీడీపీపైనే నిందారోపణలు చేశారు.
టీడీపీపై విమర్శలు
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదని జగన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కాదని.. సంపూర్ణ మెజారిటీతో పాలన సాగిస్తున్న మోదీ సర్కార్ను గట్టిగా ప్రశ్నించలేమని ఆయన వ్యాఖ్యలు సంచలన చేశారు. ఓటుకు కోట్ల కోసం గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందంటూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ కోసం టీడీపీ రాజీపడిందని, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా ఇవ్వాలని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకహోదా ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చే ఉద్యోగాలనూ తాకట్టు పెట్టారన్నారు. మొత్తంగా ప్రత్యేక హోదాపై తాను విఫలమయ్యానన్న కోణంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Must Read ;- రఘురామ ఫిర్యాదుపై కదిలిన లోక్ సభ జగన్ కు కష్టాలేనా?











