ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం ధిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అపాయింట్ ఖరారైందని, అయితే సమయంపై ఇంకా స్పష్టత రాలేదని వార్తలు వస్తున్నాయి. గత సోమవారం వైఎస్ జగన్ ధిల్లీకి వెళ్తారని ప్రచారం జరిగినా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాతో అపాయింట్‌మెంట్ ఖారారు కాకపోవడంతో పర్యటన రద్దైన విషయం తెలిసిందే. తరవాత వైసీపీ ఎంపీలు ధిల్లీలోనే ఉండి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అపాయింట్ మెంట్ ఖరారైందని, గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ఉందని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే తప్ప ఏపీ సీఎం వైఎస్ జగన్ ధిల్లీ పర్యటన దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.
పలు అంశాలు ప్రసావిస్తారంటూ..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ పర్యటనలో పలు అంశాలు ప్రస్తావిస్తారని, పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు, కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా తదితర అంశాలపై మాట్లాడతారని చెబుతున్నారు. కాగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిల్లీ టూర్ పై పలు రకాలు చర్చ నడుస్తోంది. ఈ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రి సింగ్ షెకావత్ ని కూడా కలుస్తారని చెబుతున్నా ఇంకా అపాయింట్లు ఖరారు కాలేదు.
వైఎస్ జగన్ ధిల్లీ టూర్ పై ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికే పలు విమర్శలు చేస్తోంది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి కావాల్సిన, రావాల్సిన నిధుల విషయాలకంటే తనపై ఉన్న కేసుల విషయంలోనే ఎక్కువగా మాట్లాడేందుకు వెళ్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. గతంలోనూ వైఎస్ జగన్ ధిల్లీ టూర్‌పై ఇలాంటి కామెంట్లే చేశారు. ఇక ఇటీవల నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారం కూడా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Must Read ;- జగన్‌కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?
బెయిల్ రద్దు పిటిషన్ వేసినందుకే తనపై దాడి అంటున్న రఘురామరాజు..
సీఐడీ అరెస్టు చేసిన సమయంలో తనపై దాడి జరిగిందని, కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, దేశ ద్రోహం కేసు నమోదుచేయడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇప్పటికే ఆరోపించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, కేంద్ర మంత్రులకు, దేశంలోని ఎంపీలకు, ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలకు వారివారి స్థానిక భాషలో లేఖలూ రాశారు. ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తాను పిటిషన్ వేసినందునే తనపై కక్షగట్టారని, ఎంపీగా ఉన్న తనని చిత్రహింసలకు గురిచేశారని చెబుతూ రఘురామకృష్ణ రాజు ఆరోపిస్తున్నారు. ధిల్లీలో ఉండి జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, భారీ ఎత్తున కమిషన్లు పొందారని ఆరోపిస్తూ రఘురామకృష్ణ రాజు కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి ఆర్మీ ఆసుపత్రిలో తనకు చికిత్స జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఆధారాలతో సహా వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా తన ఐ ఫోన్‌కు సంబంధించి, సీఐడీ కస్టడీలో ఉన్నట్లుగా చెబుతున్న ఫోన్ నుంచి వెళ్లిన మెస్సేజ్ గురించి ధిల్లీలో పార్లమెంటు స్ట్రీట్ పోలీసులకు రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కూడా విచారణలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతకరించుకుంది. అయితే ఇప్పటికి పలుమార్లు ధిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ ఎక్కువ పర్యాయాలు కేంద్ర హోంమంత్రితోనే భేటీ అయ్యారని, ఇతర శాఖ మంత్రులల్లో ఇద్దరు ముగ్గురితో భేటీ కావడం కూడా చాలా తక్కువ సార్లు జరిగిందని టీడీపీ విమర్శిస్తోంది.
Must Read ;- పోలవరంలో అవినీతిపై షెకావత్‌కు రాఘురామరాజు ఫిర్యాదు