(విశాఖపట్నం నుంచి వీడియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది. టీడీపీ నేతలను భూ ఆక్రమణదారులుగా, అవినీతి పరులుగా ప్రజల ముందు నిలబెట్టేందుకు విఫలయత్నం చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉదంతంతో స్పష్టమౌతోంది.
అధికారులు చెప్పినట్లు తనకు లేవన్న పల్లా
కాపుజగ్గరాజుపేటలో ఆదివారం ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ఆ భూములను పల్లా శ్రీనివాస్‌విగా ప్రకటించారు. వాటికి మార్కెట్ విలువ కన్నాఎక్కువే చూపించి ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి వివరించారు. తన ఐదేళ్ల కాలంలో పల్లా శ్రీనివాస్ భూ కుంభకోణాలకు ఇదే నిదర్శనమని మంత్రి, ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. అయితే ఆ మరుసటి రోజే పల్లా శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి తనకున్న ఆస్తుల వివరాలను జిరాక్స్‌లతో సహా మీడియాకు అందించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను విడుదల చేశారు. అధికారులు చెప్పినట్లు తనకు కాపుజగ్గరాజుపేటలో అంగుళం భూమి కూడా లేదని, తన భూములన్నీ యాదవ జగ్గరాజుపేటలో ఉన్నాయని వివరించారు. తొలగించిన ఆక్రమణలు తనవే అని నిరూపిస్తే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ కూడా విసిరారు.
టీడీపీ నేతల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు..
అయితే ఈ పరిణామాలు గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఓ పథకం ప్రకారం టీడీపీ నేతల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని విశ్లేషిస్తున్నారు. విశాఖలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తూ ఉండగా, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇప్పటికే అధికార పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన రాజీనామా సమర్పించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఇక మిగిలిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంతకాలం అధికార పార్టీతో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన్ను బలహీన పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన అధికార పార్టీ నేతలు విసిగిపోయి వదిలేశారు. ఇంతలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులు అయ్యాక.. విశాఖలో ప్రతిపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల జోరు పెరిగింది. ఇది కాస్త ఇబ్బందికరంగా మారడంతో అధికార పార్టీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే పల్లా శ్రీనివాసరావు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే చర్యలకు ఉపక్రమించింది.
వైసీపీలో చేరడానికి శ్రీనివాసరావు నిరాకరించడంతో..
వైఎస్ఆర్ సీపీలోకి రావాల్సిందిగా పల్లా శ్రీనివాసరావును గతంలో ఆహ్వానించారు. అందుకు శ్రీనివాసరావు నిరాకరించడంతో ఏప్రిల్ నెలలో ఆయన బహుళ అంతస్తుల నిర్మాణం కూల్చి వేశారు. అప్పటి నుంచి ఈ మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల జోరు మరింత పెంచారు. మంచి ముహూర్తం చూసుకుని సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖలో ప్రారంభించాలనుకుంటున్న అధికార పార్టీకి ఈ నేతలు ఇద్దరు కంటిలో నలుసుగా మారారు. ఇరువురిని టార్గెట్ చేసేందుకు అవినీతి ఆరోపణలు, భూకబ్జాలను అంటగడుతున్నారు. పల్లా, వెలగపూడిల ఆధ్వర్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇటీవల కాలంలో నిరసన కార్యక్రమాలు పెంచారు. పరిపాలన రాజధానిలో ఒక పక్క కమ్యూనిస్టులు నిత్యం ఏదో ఒక అంశంపై ఆందోళనా కార్యక్రమాలు చేస్తుండగా, టీడీపీ కూడా అదే బాటలో నిరసన గళం వినిపిస్తూ ఉండడంతో అధికార పార్టీ నేతలకు ఊపిరి ఆడడం లేదు. ఈ క్రమంలోనే నేతలపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్టు ప్రజల్లో సైతం చర్చ జరుగుతోంది.
Must Read ;- రాజా రిపోర్టు ఇస్తే.. ఆఫీసరైనా,ఎమ్మెల్యే అయినా ఔటే











