విలక్షణమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న తమిళ హీరో జయం రవి వచ్చే ఏడాది పొంగల్ కు సందడి చేయనున్నాడు. ప్రస్తుతం జయం రవి హీరోగా మూడు సినిమాలు షూటింగులో ఉన్నాయి. అందులో ఒకటి ‘భూమి’ అయితే, ఇంకోటి ‘జనగణమన’. ఇక మూడో సినిమా పాన్ ఇండియా సినిమా ‘పొన్నియన్ సెల్వన్. మూడూ సినిమాలకూ దేని ప్రత్యేకత దానికుంది. ‘భూమి’ సినిమా కథాంశం రైతు కథాంశంలా ఉంది. జయం రవి గెటప్ రైతు మాదిరిగా ఉంది.
ఈ సినిమాని వచ్చే ఏడాది ఓటీటీ ద్వారానే విడుదల చేయాలని నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. హీరోగా జయం రవికి ఇది 25వ సినిమా. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్టుగా విడుదల చేయడానికి ఒప్పందం కుదిరినట్టు సమాచారం. 2021లో మొదటగా విడుదలయ్యే తమిళ సినిమా బహుశా ‘భూమి’ కావడానికే అవకాశం ఎక్కువ ఉంది. అప్పటికి సినిమా థియేటర్లు కూడా ప్రారంభమవుతాయి. అయినా ప్రీమియర్ గా పొంగల్ రోజు స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పందం కుదిరింది. ఆరోజు సాయంత్రం 7.30 గంటలకు ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు.
ఇందులో జయం రవికి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. దీనికి డాక్టర్ ఇమ్మన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. వాటికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని అప్ డేట్స్ త్వరలోనే విడుదలవుతాయి. ట్రైలర్ ను విడుదల చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. లక్ష్మణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక జనగణమన విషయానికి వస్తే అహ్మద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో జయం రవి కనిపిస్తున్నాడు.
ఇక మూడో సినిమా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్. ఇది మల్టీ స్టారర్ మూవీ. ఇందులో విక్రమ్, విక్రమ్ ప్రభు, జయం రవి, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్ లాంటి అతిరథ మహారథులంతా నటిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.











