నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మాణంలో తెరకెక్కిన ఈసినిమా నిజానికి ఏప్రిల్ 17నే విడుదల కావాలి. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి ఇప్పటికి విడుదల తేదీ లాక్ చేసుకుంది. నవంబర్ 4న నెట్ ఫ్లాక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది ‘మిస్ ఇండియా’. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాన్ని మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. అందరినీ ఆకట్టుకుంటోంది.
తన కలను నిజం చేసుకోవాలనుకొనే ఓ మధ్యతరగతి యువతి.. ఆ ప్రాసెస్ లో ఎన్ని ఒడుదుడుకుల్ని ఎదుర్కొంది అనేదే ఈ సినిమా ప్రధానాంశం. ‘నిజానికి చాలా దూరంగా అబద్దానికి చాలా దగ్గరగా బ్రతుకుతున్నావ్.. నువ్వు అన్నయ్య జాబ్ చేస్తే తప్ప మన ఇల్లు సరిగా గడవదు.. అలాంటిది నువ్ బిజినెస్ చేయడం’ అని తల్లి పాత్ర చెప్పడం.. ‘బిజినెస్ అనేది నీ మాటల్లో నుంచి కాదు.. నీ మనసులో నుంచి కూడా పూర్తిగా తీసేయ్’ అని అన్నయ్య పాత్ర హెచ్చరించడం లాంటివి సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తెలియజేస్తోంది.
‘జీవితంలో మనం చేసే ఏ పనైనా ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు.. ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం.. ‘బిజినెస్ అనేది ఆడపిల్లలు ఆడుకునే ఆట కాదు.. బిజినెస్ అంటే వార్’ అనే డైలాగ్స్ ద్వారా సంయుక్త బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ అవ్వడానికి స్ఫూర్తినిచ్చే వారితో పాటు అడ్డంకులు సృష్టించే వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. చివరగా ‘మిస్ ఇండియా అంటే నేను కాదు.. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్’ అంటూ ట్రైలర్ ముగించారు. సంయుక్త పాత్రలో కీర్తిసురేశ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.