దసరా పండగ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకు ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ – తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద బస్సులు అందుబాటులో ఉంచామని మంత్రి పేర్ని నాని తెలిపారు.
పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టల వద్ద ఏపీ బస్సులు ఉంటాయని చెప్పారు. సరిహద్దుల నుంచి ఊళ్లకు చేరేందుకు బస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జూన్ 18 నుంచి టీఎస్ ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ-ఏపీ మధ్య బస్సులు నడిపేందుకు కృషి చేశామని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ కార్యాలయానికి సెలవులు కావడంతో నిర్ణయంలో జాప్యం అయిందని అన్నారు. టీఎస్ ఆర్టీసీతో పూర్తి స్థాయి చర్చలు అనంతరం బస్సులు నడుపుతామని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ లాభనష్టాలు చూడట్లేదు, ప్రజలు ఇబ్బంది పడకూడదనే తమ ఉద్దేశమని తెలిపారు.
అడ్డగోలుగా వాహనాలు నడిపితే చర్యలు
అంతే కాకుండా వాహనాలను అడ్డగోలుగా నడిపితే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను తిప్పితే వాటి లైసెన్సులు పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. వాహనదారులు అందరూ బాధ్యతయూతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.ఫిటెనెస్ సర్టిఫికేట్లు లేని వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుదని ఆయన పేర్కొన్నారు.