రాజుగారి గదిలో.. సారీ మదిలో ఉన్న ఆస్తి అంతా తెలుగు సినిమానే. అందరికీ డిగ్రీలు పేరు చివర ఉంటాయి. ఈ రాజుకు ముందే డిగ్రీ ఉంది. అది సినిమాను ప్రేమించిన డిగ్రీ. అందుకే అందరికీ బీఏ రాజు అయ్యారు.
నిజానికి డాక్టర్ బీఏ రాజు అవ్వాలి. సీనియర్ ఫిలిం జర్నలిస్టు, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఆకస్మిక మరణం ఓ పట్టాన జీర్ణించుకోలేనిది. రాజు గురించి నాలుగు మాటలు రాయాలి.. ఏం రాయాలి? ఎలా రాయాలి? ఆయన గురించి ఏం రాసినా తక్కువే.. అందుకే రాయగూడదనుకున్నా.. రాయకుండా ఉండలేకపోతున్నా. రాజుగారి గురించి రాయాలంటే రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి. రాజుగారితో పరిచయం లేకముందు ఆయన ‘సూపర్ హిట్’ కలెక్షన్ల లెక్క గురించే అందరిలోనూ చర్చ ఉండేది. ఆయన గురించి వినడం తప్ప ఆయనతో మాట్లాడటం, ఆయన్ని కలవడం 2000 సంవత్సరం జరిగింది.
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడకు వెళితే ‘రాజు’లా బతకొచ్చనుకున్నా.. ఇక్కడ అడుగుపెట్టాక రాజు బతికే ప్రపంచం ఇదేనని, ఆయనకు సినిమాయే ప్రపంచమని తెలుసుకున్నా. ఫలానా రోజు రాజుగారి ప్రెస్ మీట్ అనగానే మిత్రుల నుంచి ‘విషయం’ ఏమన్నా ఉందా? అనే అనుబంధ ప్రశ్న వచ్చేది. రాజును కలిశాక రాజులోనే విషయం ఉందని అర్థమైంది. ఆయనతో కలిసి భోజనం, ఆయనతో కలిసి ప్రయాణం.. నవ్వుతూనే పంచ్ లు పడుతుంటాయ్. ‘ఏసేశాడు’ అనిపిస్తుంది. ఆయన మాటల్లో విరుపు.. సినిమా ప్రముఖులతో కనిపిస్తే మెరుపు. అందుకే రాజు ఇక లేడని, ఇక రాడని తెలిసి స్పందించని సినీ ప్రముఖలు లేరు.
స్టార్ పీఆర్వో..
సినిమా రంగానికి ఇది కొత్త పదమే. ఎందుకంటే స్టార్ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు ఉంటారు. స్టార్ పీఆర్వో ఏమిటి? అనే ప్రశ్న తలెత్తక మానదు. సినిమా జర్నలిస్టులను మర్యాదగా చూసుకునే పీఆర్వోలలో ఆయనకే పెద్ద పీట వేసేవారు. పైగా అప్పట్లో పెద్ద హీరోలను ఇంటర్వ్యూ చేయాలంటే రాజుగారే ఏర్పాటుచేసేవారు. ఆయన నడిచే ఎన్ సైక్లోపీడియా.. సినిమా జర్నలిస్టులకు ఓ వికీపీడియా. కృష్ణగారంటే ఆయనకు వీరాభిమానం. అప్పట్లో ఉదయం పది, పదిన్నరకే సూపర్ స్టార్ కృష్ణగారు పద్మాలయా స్టూడియోకి వచ్చి తన ఆఫీసు గదిలో కూర్చుని ఉండేవారు.
నన్ను మొదటిసారిగా కృష్ణగారి దగ్గరకి తీసుకెళ్లింది కూడా రాజుగారే. అప్పుడు కృష్ణగారి కుమార్తె మంజుల ‘షో’ అనే సినిమా చేస్తున్నారు. నన్ను ‘ఈనాడు’ జర్నలిస్టుగా పరిచయం చేయగానే కృష్ణ గారు నన్ను అడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యం వేసింది. ‘దుర్గారావు తెలుసా?’ ఇదీ కృష్ణగారి ప్రశ్న. ఈనాడులో ఆ దుర్గారావు అనే వ్యక్తి గురించి నాకు సూచన ప్రాయంగా తెలుసు. అతను కృష్ణగారికి వీరాభిమాని. ఆ తర్వాత ‘విశ్వప్రసాద్ ఏంచేస్తున్నారు?’.. ఇది కృష్ణగారి రెండో ప్రశ్న. తన అభిమానులను ఆయన ఎంతలా గుర్తుపెట్టుకుంటారో అప్పుడు అర్థమైంది.
రాజుగారు కృష్ణగారికి ఎందుకు వీరాభిమానిగా మారారో అప్పుడే తెలిసింది. తనని అభిమానించేవారిని కృష్ణగారు అక్కున చేర్చుకుంటారనడానికి అంతకన్నా నిదర్శనం ఏముంటుంది. బహుశా రాజుగారు అలాగే కృష్ణగారికి అలానే దగ్గరై ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణగారు కూడా ‘వస్తాడు నా రాజు ఈరోజు’ అనుకునేవారేమో. ఎందుకంటే కృష్ణగారు స్టూడియోలో ఉంటే రాజుగారు రోజూ వెళ్లి కలిసేవారు. ఇలా రాజుగారి గురించి చెబుతూ పోతే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఆయనకు తోడుగా ఓ నీడగా జయ ఉండేవారు.
ఓసారి ఓ అమ్మాయి ఇంజినీరింగ్ కాలేజీ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతోందని రాజుగారితో అనగానే రూ. 25వేల ఫీజును జయగారితో కట్టించే ఏర్పాటును ఆయన చేశారు. రాజుగారి దగ్గర ఎంతో విషయముంది.. కానీ ఆ విషయానికి వీలునామా లేకుండా పోయింది. అది ఆయనలోనే సమాధి అయిపోయింది. ఆయన తనకున్నదంతా సినిమాకే ఇచ్చేశాడు.. రాజులా వచ్చాడు.. మహారాజులా నిష్క్రమించాడు.
– హేమసుందర్
Must Read ;- సీనియర్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత











