కొన్ని క్రేజీ కాంబినేషన్స్ .. కేవలం రూమర్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. అదే కానీ నిజమైతే.. అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. అలా.. ఆచరణకు సాధ్యమైన ఓ క్రేజీ కాంబోకి టాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు యువ సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతిలోక సుందరి, దివంగత నటీమణి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ జోడీగా సినిమా రాబోతోందని ఈ వార్త యొక్క సారాంశం.
నిజానికి జాన్వీ కపూర్ ను ఒక సెన్సేషనల్ మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా లాంఛ్ చేయాలని శ్రీదేవి అనుకొనేవారు. అయితే సరైన హీరో, దానికి తగ్గ కథ సెట్ అవ్వక ఇంత వరకూ అది సాధ్యం కాలేదు. శ్రీదేవి మరణానంతరం ఇప్పటికి అది సాధ్యం కానున్నదని టాలీవుడ్ టాక్. ఇక మహేశ్ బాబును, జాన్వీకపూర్ ను కలుపుతోన్న దర్శకుడు మరోవరో కాదు . మాటల మాంత్రికుడు త్రివిక్రమే. ఇటీవల త్రివిక్రమ్.. జాన్వీకి స్టోరీ వినిపించారని, ఆ కథ ఆమెకు బాగా నచ్చి, సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం.
మహేశ్ బాబు తండ్రి కృష్ణ, జాన్వీ తల్లి శ్రీదేవి కలిసి ఎన్నో సినిమాల్లో జోడీగా నటించారు. ఒకప్పుడు వీరిద్దరిదీ హిట్ పెయిర్. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్సే. అలాంటి హిట్ పెయిర్ వారసులు .. జోడీగా నటిస్తున్నారనగానే.. ఈ సినిమా మీద రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. నిజానికి మహేశ్ 28 మూవీలో కథానాయికగా పూజా హెగ్డేనే నటిస్తోందని వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాలో జాన్వీ అయితేనే .. బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. మరి ఈ వార్తలోని నిజానిజాలేంటో చూడాలి.