ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖుల్ని పొట్టనపెట్టుకుంది. అనేకమంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించారు. తాజాగా కరోనా బారిన పడి.. ప్రముఖ సినీ జర్నలిస్ట్, నటుడు, ఇంటర్వ్యూయర్ టీ.యన్.ఆర్ అనే తిరుమల నరసింహారెడ్డి కన్నుమూశారు. ఇటీవల కరోనా పాజిటివ్ తో హాస్పిటిల్ లో జాయిన్ అయిన ఆయన ఆరోగ్యం విషమించి ఆదివారం కోమాలోకి వెళ్ళారు. వెంటిలేటర్ మీద చికిత్స అందించినా ప్రయోజనం లేదు. చివరికి సోమవారం ఉదయం కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో జర్నలిస్ట్ లోకం, సినీ పరిశ్రమ షాక్ కు గురైంది.
సినీ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన టీ.యన్.ఆర్ .. అతి తక్కువ సమయంలోనే ఎందరో ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేసి.. మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో ఎందరికో టీయన్ఆర్ ఆత్మీయుడయ్యారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అందరితోనూ స్నేహసంబంధాలు కొనసాగించే ఆయన లేకపోవడం నిజంగా పాత్రికేయ లోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటు. టీయన్ఆర్ మృతికి సినీ ప్రముఖులు, జర్నలిస్టులు తమ సంతాపాన్ని తెలియచేశారు.