అనస్తీషియా డాక్టర్ సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ పై మండిపడ్డారు. సోమవారం ఆయన సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సుధాకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సుధాకర్ కుటుంభ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుధాకర్‌ను శారీరకంగా, మానసికంగా వేధించి ప్రాణాలు తీశారని ఆరోపించారు. వెంటనే జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వైద్యుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుధాకర్ పరిస్థితి ఏపీలో మరో డాక్టర్ కు రాకూడదని నారా లోకేశ్ పేర్కొన్నారు. సుధాకర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది..
ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని, జగన్ రెడ్డి దళితులను, దళిత మేధావులను వెంటాడి, వేధించి, చంపేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ జగన్ రెడ్డి బలితీసుకున్నాడని ధ్వజమెత్తారు. మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం ఆయన పై కక్ష కట్టిందని, నడి రోడ్డు పై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించిందని, పిచ్చోడనే ముద్ర వేసిందని అన్నారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా మారకపోతే, ప్రజలే బుద్ది చెప్తారని నారా లోకేశ్ అన్నారు.
Must Read ;- గుంటూరు ఎస్పీపై నారా లోకేశ్ ఆగ్రహం











