సినిమా జీవితం.. ఇది తెరచాపలేని పడవ.. ఎటు పోతుందో ఎవరికీ తెలియదు.. ఎప్పుడు మునిగిపోతుందో అంతకంటే తెలియదు. ఈ కళను నమ్ముకుని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే కళ్లు ఎన్నో. అదే సినిమా పిచ్చి అంటే. ఆ పిచ్చిని కరోనా కాదు కదా దాని తల్లో జేజమ్మ కూడా వదిలించదు. ఆ పిచ్చే లేకుంటే సినిమా తీయడమే కష్టం. అంత కష్టాన్నీ నష్టాన్నీ భరిస్తూ బతుకు బండిని లాగించగలగాలి. అయనా కష్టాలు మనుషులకు కాకుండా మాకులకు వస్తాయా? అసలు కష్టం అంటే ఏమిటో ఈ కరోనా కాలంలో ఈ సినీజీవికి అర్థమవుతోంది. వందేళ్ల సినీ చరిత్రలో ఇంత కష్టం ఏనాడూ రాలేదు.
అందుకే సినీ జీవి వలసజీవిగా మారిపోయాడు.. సొంతూరికి పయనమై పోతున్నాడు. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది జీవితం. సినిమా తప్ప వేరే ఏ పనీ చేతకాదు.. ఊళ్లోకి వెళితే ఛీత్కారాలు. అయినా తప్పదు మరి. కృష్ణానగర్ కదిలిపోతోంది.. కష్టాలకు బెదిరిపోతోంది. ఎన్ని అరటి తొక్కలు తింటే కడుపు నిండుతుంది.. ఎంత నీరు తాగితే ఆకలి తీరుతుంది. అందుకే గ్లిజరిన్ లేకపోయినా సినీ జీవికి కన్నీళ్లొచ్చేస్తున్నాయి. గుప్పెడంత గుండెలో సముద్రమంత దుఃఖాన్ని ఎలా దాచుకోగలిగేది.
ఎంత చెట్టుకు అంత గాలి..
అంతా పైన పటారం లోన లొటారమే. బడా నిర్మాత దగ్గర్నుంచి లైట్ మన్ దాకా పైకి కనిపించేది ఒక కోణమే. జీవితం తల్లకిందులవ్వడానికి ఎంతో సేపు పట్టదు. ఫార్చ్యూనర్ కారున్నా అందులో ఉండే పెట్రోలు అడుగంటే ఉంటుంది. ఏదో ఒకరోజు మన ఫార్చ్యూన్ మారకపోతుందా అన్న ఆశే జేబులో వంద రూపాయలు లేకున్నా అతని బతుకు బండిని ముందుకు నడిపిస్తూ వచ్చింది. ఓ పక్క కడుపు కాలుతున్నా నోరు ఖరీదైన సిగార్ వెలిగిస్తుంది. ఏ కథ మైండ్ బ్లోయింగ్ అంటాడు.. వంద కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అంటూ నమ్మిస్తాడు.
చివరికి కరోనా అతడి బతుకు బండిని పట్టాలెక్కించలేకపోతోంది. అంతా సద్దు మణుగుతుందా? జీవితం ఎప్పుడు దారిని పడుతుంది? కరోనా మూడో వేవ్ వస్తే పరిస్థితి ఏమిటి?.. ఇవన్నీ ఈ సినీ జీవి మదిలో మెదిలే ప్రశ్నలే. అందుకే బ్యాక్ టుది పెవిలియన్ అన్నట్లుగా జీవితం తయారైంది. ఈ సినీ జీవి తాను పాడుతూ ఎంతో మందితో పాడించాడు.. తను డైలాగులు చెబుతూ జనం నోటితో ఈలలు వేయించాడు. తనకు దక్కింది ఏమిటని లెక్కతీస్తే ఏమీ లేదని తేలింది. ఈ తారా పథంలో అందమైన సౌధాలు పది ఉంటే మిగతా 90 గుడిసె జీవితాలే. కేరాఫ్ గణపతి కాంప్లెక్స్, కేరాఫ్ మంగ టిఫెన్ సెంటర్, కేరాఫ్ ఫిలింనగర్ శంకర్ విలాస్.. చివరికి చూస్తే జీవితమే లాస్.
తెల్లారి లేస్తే వేషాల కోసం వెతుకులాట. ఆ పూటకి భోజనం దొరికితే చాలన్న ఆలోచన. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్ర ఆరు గంటల వరకూ షూటింగ్ కు వెళితే చేతిలో రూ. 300 పడితే హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే జూనియర్ ఆర్టిస్టులు, హీరోలతో తన్నులు తినే ఫైటర్లు, హరోహీరోయిన్లను ఎలివేట్ చేయడం కోసం గుంపులో గోవిందయ్యల్లాంటి గ్రూప్ డ్యాన్సర్లు.. ఇలా ఎందరో ఎందరెందరో. కళ్ల ముందు రంగుల ప్రపంచం గిర్రున తిరిగేసరికి పొలం పుట్రా, నగా నట్రా అమ్మేసి సినిమా తీసి.. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఏమీ పాలుపోని స్థితిలో ఉండే నిర్మాతలు.. ఇలా ఎందరి జీవితాల్లోకి తొంగి చూసినా చేదు అనుభవాలే.
కన్నీటితో దాహాన్ని…కాఫీలతో కడుపుల్ని నింపుకోలేక ఈ కరోనా కష్టకాలంలో సొంతూరికి చేరుకుంటున్నారు ఎందరో సినీ జీవులు. నలభై ఏళ్లు వచ్చినా పెళ్లీ పెటాకులు లేక ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన జీవితాలు నేడు సేద తీరాలనుకుంటున్నాయి. అందుకే ఈ సినీ జీవితానికి వ్యాక్సిన్ లేదు. ముగింపు లేని సినిమా ఇది. కళనే నమ్ముకుని వచ్చి అంపశయ్య మీద పవళిస్తున్న సినీ జీవికి మోక్షమెప్పుడు? వీరిని ఆదుకునే రియల్ హీరో ఎవరు? ఈ కారోనా కాలంలో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
-హేమసుందర్
Must Read ;- కరోనాతో కాదు ఆకలి చావులేనంటున్న సినీ జనం











