పూజా హెగ్డే .. ఇటు ఇండస్ట్రీ లోపల .. అటు ఇండస్ట్రీ బయట ఇప్పుడు ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. నేలపై నడిచే జలకన్యలా .. మోడ్రన్ డ్రెస్ లకు అలవాటు పడిన దేవకన్యలా ఆమె కనిపిస్తుంది. అందానికి తోడు సక్సెస్ లు కూడా తోడవుతూ ఉండటంతో, ఇప్పుడు ఈ సుందరి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతోంది. గత మూడేళ్లుగా పూజా హెగ్డే ఏడాదికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తూ వెళుతోంది. మధ్యలో ఒక్క ఫ్లాప్ కూడా జొరబడకుండా ఆమె వరుసగా నాలుగు హిట్లను నమోదు చేసింది. అలా ప్రస్తుతం ఆమె నెంబర్ వన్ స్థానంలో చక్రం తిప్పుతోంది.

ఆమె తాజా చిత్రంగా ‘రాధే శ్యామ్’ రూపొందుతోంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా సాగనుంది. కథలో అన్నిరకాల హంగులను సర్దేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి దృశ్యం ఒక అద్భుతం అనిపించే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. తెలుగుతో పాటు హిందీ .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమా, పూజా హెగ్డే కెరియర్లో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ ఇచ్చిన హిట్లతో నెంబర్ వన్ ప్లేస్ కి చేరుకున్న ఆమె, అక్కడ కొంతకాలమైనా నిలకడగా ఉండాలంటే అందుకు కావాలసిన షెల్టర్ ఈ సినిమా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అంతేకాదు .. ఆమెకి ఇష్టమైన బాలీవుడ్ నుంచి అవకాశాలు తెచ్చిపెట్టే బాధ్యత కూడా ఈ సినిమాపైనే ఉంది. తమిళ .. మలయాళ .. కన్నడలో పూజా ఫాలోయింగ్ పెరిగేలా ప్రోత్సహించే పనికూడా ‘రాధే శ్యామ్’ పైనే ఉంది. అఖిల్ జోడీగా పూజా హెగ్డే చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఈ ఏడాదిలోనే రానున్నప్పటికీ, ప్రభాస్ సరసన ఆమె చేసిన ‘రాధే శ్యామ్’ పైనే అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమా పూజా హెగ్డేను ఎటువైపుకు తీసుకెళుతుందో చూడాలి మరి.











