ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతా కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. దిగ్గజ కంపెనీలు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ తో పాటు భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌కు భారత్‌లో అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన ఆమోదం లభించింది. దీంతో కొవిడ్ నియంత్రణకు మరింత అవకాశం ఏర్పడినట్టు సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతున్న వేళ..కొన్ని పక్షాలు సంబంధం లేని విధంగా విమర్శలు చేస్తుండడమే సంచలనంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న, పలు వైరస్‌లకు వ్యాక్సిన్లు సమర్థవంతంగా అందించిన దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌ను కొందరు రాజకీయ నాయకులు నీళ్లతో పోల్చడంతో అంతర్జాతీయంగా భారతదేశ రాజకీయ పార్టీల వైఖరి చర్చనీయాంశంగా మారింది.
దేశీయ వ్యాక్సిన్‌పై రాజకీయ విమర్శలా..!
వ్యాక్సిన్ల తయారీకి కంపెనీలు ఎంత కష్టపడతాయో..అంతకంటే ఎక్కువ ఆ ఫార్ములాను కాపాడుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇటీవల వ్యాక్సిన్లు తయారు చేస్తున్న కంపెనీల సర్వర్లపై హ్యాకర్లు దాడి కూడా చేశారు. ఫార్ములాను దొంగిలించడమే లక్ష్యంగా ఈ సైబర్ దాడులు జరిగినట్టు భావించారు. ఆ ఫార్ములాలను కాపాడుకునేందుకు పకడ్బంధీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే టైంలో కాంపిటేటర్ల నుంచి కూడా ఆ ఫార్ములాను, కంపెనీ గుడ్ విల్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా ఔషధ ప్రయోగాలు, వ్యాక్సిన్ల విషయంలో కొన్ని కంపెనీలు ప్రత్యర్థి కంపెనీల లోపాలు ఎక్కడ దొరుకుతాయా అని ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే ఒక్క వ్యాక్సిన్ సక్సెస్ అయితే.. ఆ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీకి అంతర్జాతీయంగా పేరు రావడం, రూ.వేల కోట్ల ఔషధ మార్కెట్ ఆ కంపెనీకి దక్కనుండడంతో ఎలాగైనా తామే ముందుండేలా కంపెనీలు కూడా పోటీ పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేశీయ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌పై ఇతర దేశాల్లో విమర్శలు వస్తే మన దేశం నుంచి డిఫెండ్ చేయాల్సింది పోయి స్వదేశంలోనే రాజకీయ రంగు పులమడంపై విమర్శలు వస్తున్నాయి. నిజంగానే ఏదైనా లోపం ఉన్నప్పుడు, సహేతుక ఆధారాలు ఉన్నప్పుడు విమర్శించవచ్చు. కాని కేవలం రాజకీయ కారణాలతో కొవిడ్ వ్యాక్సిన్‌పై విమర్శలు చేయడంపై ఆ రాజకీయ పార్టీల నాయకుల పరిణితిపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు : కృష్ణ ఎల్లా
ఇక భారత్ బయోటెక్ కొవాగ్జిన్ విషయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై ఆ కంపెనీ ఛైర్మన్ కృష్ణ ఎల్లా స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. భారత కంపెనీలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా బురద జల్లుతున్నారని.. ఇది సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, శాస్త్రవేత్తలు, వాలంటీర్లకు ఈ విజయం అంకితమని, ప్రపంచానికి భారత్ కూడా సమర్థవంతమైన వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసి ఇవ్వగలదని మరోసారి నిరూపించామని పేర్కొన్నారు. యూకేతో పాటు 12 దేశాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లో కూడా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయని, తమది గ్లోబల్ లీడర్ షిప్ ఉన్న కంపెనీ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ కంపెనీ 123 దేశాల్లో వివిధ కంపెనీలకు వ్యాక్సిన్లు తయారుచేసి ఇస్తోందన్నారు. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పిన కృష్ణ ఎల్లా తమ ప్రయోగ పద్దతులను నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమోదించిందని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాము ఇచ్చిన డేటాను పరిశీలించుకోవచ్చని, యూకే స్ట్రెయిన్‌పై కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ప్రపంచంలో BSL-3 ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉన్న ఏకైక ఔషధ సంస్ధ భారత బయోటెక్ అని చెప్పేందుకు గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా..
‘నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా.. మా నాన్న రైతు. సైన్స్ నాకు ఊపిరి. మా కుటుంబానికి వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేదు. అయినా ఇప్పుడు మా సంస్థ అంతర్జాతీయంగా పేరు గడిచింది. కాపీ కొట్టే అలవాటు లేదు. చాలా దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. సృజనాత్మకత కలిగిన దేశం భారత్. ఇదేమీ కాపీలు కొట్టే దేశం కాదు. అంతర్జాతీయంగా ఉన్న టీకాలతో పోల్చితే మా టీకా ఏమాత్రం తక్కువ కాదు. ఈ వ్యాక్సిన్‌పై ఐదు పరిశోధనా పత్రాలు ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని గర్వంగా చెబుతున్నాం. ఇతర దేశాల్లో ట్రయల్స్ ను ఎందుకు ఇలా విమర్శించరు.. ఓ కంపెనీ టీకాలను నీళ్లతో పోల్చుతూ ఓ కంపెనీ చెప్పడం, నాయకులు వ్యాఖ్యానించడం చాలా బాధాకరం.’ అని వ్యాఖ్యానించారు.
కాగా, మూడో దశ ట్రయల్స్ ఫలితాలు పూర్తిగా రాకుండానే ప్రభుత్వం భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌కు అనుమతులు ఎలా ఇస్తారని ప్రముఖ రీసెర్చర్‌లు డా.గగన్ దీప్ కాంగ్, షాహిద్ జమీల్‌లు వ్యాఖ్యానించారు. ఇక ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకాతో కలసి పనిచేస్తున్నఅదర పునర్ వాలా మాట్లాడుతూ ఫైజర్, మోడర్నా, కోవిషీల్డ్ తప్ప మిగతా వ్యాక్సిన్లు అన్నీ జస్ట్ నీళ్లులాంటివే అని చెప్పడం, బీబీసీ లాంటి మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రసారం చేయడం, కొన్ని రాజకీయ పక్షాలు ఆ కథనాల నేపథ్యంగా వ్యాక్సిన్‌పై కామెంట్లు చేయడంతో భారత్ బయోటెక్ ఛైర్మన్ మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.