కేవలం పెళ్లి చేసుకోవడం కోసమే మతం మారడం అనేది సరైనది కాదని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మతాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.
కేవలం పెళ్లి కోసం మాత్రమే మతం మారడం అనేది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి కేవలం నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మత మార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యనించారు.
అలాగే వివాహాం కోసమే మతం మారడం ఆమోదనీయం కాదని మరో కేసులో 2014లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకించారు.
ఇస్లాం మతానికి మారి ముస్లింను పెళ్లి చేసుకున్న హిందూ యువతికి సంబంధించిన కేసులో 2014లో అలహాబాద్ హైకోర్టు.. ‘ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదు’ అని పేర్కొంది.











