తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక అయిన తర్వాత… పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండానే రేవంత్ రెడ్డి స్పీడు పెంచేసినట్లుగా కనిపిస్తోంది. తనను టీ పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసిన వైనంపై పార్టీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అసంతృప్త గాలులను తగ్గించే పనిని రేవంత్ మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లుగా పేరొందిన పలువురు కీలక నేతలతో రేవంత్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీ పీసీసీ చీఫ్ కు ఎంపిక అయిన మరుక్షణమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చేసిన రేవంత్ జెడ్ స్పీడుతో కదులుతున్న వైనంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
అనుకున్న ఫలితం సాధించి…
పీసీసీ పదవి కోసం తనదైన శైలిలో లాబీయింగ్ నడిపిన రేవంత్… రోజుల తరబడి ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. తనకు కీలక పదవి ఇస్తే… తాను ఏం చేయగలను? పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా ఎలాంటి చర్యలు చేపడతాను? పార్టీలో రేకెత్తే అసమ్మతిని ఏ రీతిన చల్లబరుస్తాను? అందరినీ ఎలాంటి వ్యూహంతో కలుపుకుని ముందుకు సాగుతాను? అన్న విషయాలను అధిష్ఠానం ముందు పెట్టిన రేవంత్… తాను అనుకున్న ఫలితాన్ని అయితే సాధించారు. ఈ మేరకు అధిష్ఠానం నుంచి తనకు సానుకూలంగా ఫలితం రాగానే… రేవంత్ కార్యరంగంలోకి దిగిపోయారనే చెప్పాలి.
నిన్న జానా… నేడు వీహెచ్
ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే… ఆదివారం తెల్లారగట్ల పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలు, రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత స్థితి, తనను అధిష్ఠానం ఎందుకు ఎంపిక చేసిందన్న వివరాలను జానాకు వివరించారు. అంతేకాకుండా పార్టీలో సీనియర్లుగా ఉన్నవారంతా తనకు సాయం చేయాల్సిందేనని, తాను వారందరి మాట మేరకే నడుచుకుంటానని కూడా రేవంత్ చెప్పినట్లుగా సమాచారం. ఇక తాజాగా నేటి ఉదయం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వి. హన్మంతరావును కలిసేందుకు రేవంత్ బయలుదేరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వీహెచ్ ప్రస్తుతం హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ నేరుగా ఆసుపత్రికే వెళ్లి… వీహెచ్ ను కలిశారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రేవంత్… తనకు పదవి దక్కిన విషయాన్ని, పార్టీని పురోభివృద్ధిలో నడిపేందుకు ఇవ్వాల్సిన సహకారాన్ని వీహెచ్ ముందు పెట్టినట్లు సమాచారం. రేవంత్ వినతికి వీహెచ్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.
Must Read ;- నలుదిక్కులా నిరసనలే!.. రేవంత్ నెట్టుకొచ్చేదెలా?