తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ నియామకంలో జరుగుతున్న జాప్యానికి త్వరలోనే ముగింపు వస్తుందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతల ధిల్లీ టూర్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లోని కొందరు నేతలు జూన్ 14లోపే టీపీసీసీ అంశంపై నిర్ణయం వస్తుందని చెప్పడం కూడా ఈ చర్చకు కారణమైంది.
కీలక నేతలు రాజధానిలో మకాం..
తాజాగా టీపీసీసీ రేసులో ఉన్నారని చెబుతున్న కీలక నేతలు రాజధానిలో మకాం వేశారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, కీలక నేత మధు గౌడ్ యాష్కీ, మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, భువనగిరి (బోన్ గిర్) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కలు ధిల్లీకి వెళ్లారు. వీరిలో మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు రెండు రోజుల నుంచి ధిల్లీలోనే ఉండి లాబీయింగ్ చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఎంపీ రేవంత్‌రెడ్డి ధిల్లీకి వెళ్లగా శనివారం ఉదయం మల్లు భట్టి విక్రమార్క హడావుడిగా ధిల్లీకి బయలు దేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ విడిది చేసిన రాజ్ భవన్‌లో టీపీసీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఉత్తమ్‌తో పాటే మల్లు భట్టి విక్రమార్క కూడా CJIని కలవాల్సి ఉన్నా ధిల్లీ నుంచి ఫోన్ రావడంతో అత్యవసరంగా బయలు దేరినట్టు సమాచారం.
ప్రస్తుతం పంజాబ్ వివాదంపై కాంగ్రెస్ దృష్టి
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్‌లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృతసర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య జరుగుతున్న వివాదంపై దృష్టి సారించిందని, అందులో భాగంగా 5 పాయింట్ ఫార్ములాను రూపొందించిందని తెలుస్తోంది. ఇదే కోణంలో తెలంగాణ పీసీసీపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాలు చూస్తున్నకార్యదర్శి బోస్‌రాజు కూడా బెంగళూరు నుంచి ధిల్లీ చేరుకోవడం, టీపీసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ శనివారం సాయంత్రం తమిళనాడు నుండి ధిల్లీకి బయలు దేరనుండడంతో కాంగ్రెస్ పార్టీలో ఈ చర్చ తీవ్రమైంది. అదే సమయంలో టీపీసీసీ నియామకానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుందన్న సమాచారం నేపథ్యంలో ఆశావాహులుగా ఉన్నవారిలో పలువురు నేతలు ధిల్లీకి చేరారని, పార్టీలోని ముఖ్య నేతలతో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Must Read ;- టీపీసీసీని తేల్చే పనిలో అధిష్టానం.. రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి
రాజస్థాన్ వ్యవహారంలో బిజీ..
ఇక్కడే మరో అంశంకూడా చర్చకు వస్తోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న జితిన్ ప్రసాద ఇటీవలే బీజేపీలో చేరారు. జితిన్ ప్రసాద, సచిన్ పైలట్‌లు ఇద్దరూ సన్నిహితులు కావడం, ఇద్దరూ రాహుల్ గాంధీ టీంలో ఉన్న నేతలే కావడం, శనివారం సచిన్ పైలట్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. అదే సమయంలో తాను కాంగ్రెస్ ముఖ్యనేతలను కలిసే యోచన లేదని సచిన్ పైలట్ వ్యాఖ్యానించడం చర్చకు కారణమైంది. గత ఏడాది రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కి సచిన్ పైలట్‌కి విబేధాలు తారస్థాయికి చేరడంతో కాంగ్రెస్ అధిష్టానం సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో జితిన్ ప్రసాద్ కూడా సచిన్ పైలట్ వైపే ఉన్నారు. కాగా సచిన్ పైలట్ ధిల్లీకి రావడానికి కారణాలేంటనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు సచిన్ పైలట్ బీజేపీలో చేరడం ఖాయమని బీజేపీ నేత రీటా బహుగుణ వ్యాఖ్యానించగా సచిన్ పైలట్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఢిల్లీలో మరోసారి సచిన్ పైలట్ పంచాయితీ నడుస్తున్నందున తెలంగాణ పీసీసీ నియామకం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.
వీహెచ్ సంచలన లేఖ..
కాగా ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీనేతలపైనా విమర్శలు చేసే మాజీ ఎంపీ వీహెచ్ తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్కపై ఫిర్యాదు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కి లేఖ రాసినట్టు వార్తలూ వస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని, అయితే తొమ్మిది రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు కూడా CLP నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఈ విషయంపై మాట్లాడలేదని ఫిర్యాదు చేశారు. జేసీ దివాకరరెడ్డి గతంలో సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడినా ఎవరూ స్పందించలేదని, దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో పార్టీ అన్నికోణాల్లో ఆలోచించాలని, సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుని 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా టీపీసీసీ ఎంపిక జరగాలని గతంలో వీహెచ్ కోరిన విషయం తెలిసిందే.
Also Read ;- కొంపముంచుతున్న కాలయాపన.. ఓవర్లు అయిపోతున్నా బ్యాటింగ్ చేయని టీకాంగ్రెస్










