‘‘ఇప్పటిదాకా ఒక లెక్క… ఇప్పటి నుంచి ఓ లెక్క… ఆడొచ్చాడు.. రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పు…’’ అంటూ రేవంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియోలో హోరెత్తిస్తున్నారు. నిజంగానే తెలంగాణ రాజకీయాలు ఇక నుంచి మరో లెక్కలో వెళతాయనడంలో డౌటే లేదు. ఇప్పటిదాకా.. మంచాన్ని నాలుగు వైపుల నుంచి లాగినట్లే లాగారు కాంగ్రెస్ నేతలు.. ఎవరూ ముందుకు వెళ్లకుండా..వెనక్కు లాగుతూనే ఉన్నారు. ఎవరికి వారు తామే కింగులమంటూ రెచ్చిపోవడం కాంగ్రెస్ లో అలవాటు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైములో చెరిగిపోయింది. ఆయనే రాజు ఆయనే మంత్రిలా వ్యవహారం నడిచింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో అలాంటి నాయకత్వం అందించడం బహుశా రేవంత్ రెడ్డికే సాధ్యం. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో వన్ సైడ్ డ్రైవింగ్ నడవబోతుందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి దూకుడు, ఆయనకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్..ముఖ్యంగా కేసీఆర్ శత్రువుల్లో ఆయన పట్ల ఉన్న క్రేజ్..ఇవన్నీ.. ఓ రేంజ్ లీడర్ షిప్ అందించే దిశగా వెళతాయనే ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
టీఆర్ఎస్ ను మించి బీజేపీకే నష్టం
ఒక దశలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక బీజేపీయే ప్రతిపక్షం..కేసీఆర్ ని ఢీకొట్టేది ఇక బీజేపీనే అంటూ టాక్ మార్మోగింది. దుబ్బాక ఉప ఎన్నికతో ఆ టాక్ మరింత చెలరేగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన ఓట్లతో బీజేపీ ఇక రాబోయే అధికారం తనదేనని ఫిక్స్ అయిపోయింది. కాని తర్వాత కేసీఆర్ వేసిన ఒకే ఒక పాచికతో అవన్నీ కొట్టేసినట్లు అయిపోయింది. ఢిల్లీలో కేసీఆర్ దోస్తీ ఉందనే వార్తలు రావడంతో.. రాష్ట్రంలో బీజేపీ నేతలు కామెడీ అయినంత పని అయింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికతో అదే ప్రూవ్ అయింది. ఇప్పుడు హూజురాబాద్ తో మళ్లీ జూలు విదిల్చాలని చూస్తున్నారు. ఈ టైమ్ లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంట్రీ ఇవ్వడం నిజంగా బీజేపీకి గట్టి స్ట్రోకే. అయితే హూజురాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ బొమ్మతో నడుస్తుంది కాబట్టి.. అక్కడ ఫలితాలు వేరేగా ఉంటాయి.
కోమటిరెడ్డి పరిస్థితేంటో?
కాని ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుమ్ము రేపుతుందని…ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని ఆపటానికి ప్రయత్నించిన వారంతా ఇక నుంచి ఏం చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీహెచ్ లాంటి నేతలతో సమస్య లేదు..ఎందుకంటే సీనియారిటీ ఉన్నా మాస్ మద్దతు లేదు. శ్రీధర్ బాబు పరిస్దితి కూడా అంతే. ఎటొచ్చీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ జిల్లా మొత్తం ప్రభావం చూపించగలిగిన నేత. పైగా రేవంత్ తో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడినవాడు. కాబట్టి సహకరిస్తారాఝ..లేక నల్గొండ వరకు చూసుకుంటారా అనేది కూడా చూడాలి. పైగా రేవంత్ తనకు నచ్చినవారిని నేతలుగా రంగంలోకి దింపాలనుకుంటే..ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడటం ఖాయమే. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటూ బీజేపీలోకి వెళ్లిపోవడం కూడా అంతే ఖాయం. ఇప్పటివరకు అన్నకు పదవి వస్తుందేమోనని ఆగిన రాజగోపాల్ రెడ్డి ఇక ఆలస్యం చేయకుండా బీజేపీలోకి వెళ్లిపోతారనే చెబుతున్నారు. అయితే అసంతృప్తిగా ఉండే నాయకుల్లో కొందరిని కేసీఆర్ మేనేజ్ చేసి..కాంగ్రెస్ లో నే కుంపటి రగిలేలా చేసే అవకాశం అయితే ఉంది. దానిని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేదే చూడాలిక.