తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. మేడ్చల్ కీలక నేత రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ పంపారు. గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన రేవంత్ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ తర్వాత మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రేవంత్ రెడ్డి విజయంలో లక్ష్మారెడ్డి కీలక పాత్ర పోషించారనే పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డి ప్రకటించగానే.. లక్ష్మారెడ్డి రాజీనామా చేయడంలో సంచలనంగా మారింది.
Also Read:-బిగ్ బ్రేకింగ్.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి!
ముసలం మొదలైందా..
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లీడర్లు వ్యతిరేకిస్తే, మరికొందరు లీడర్లు స్వాగతిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కు సేవా చేశామని.. బయటి నుంచి వచ్చినవాళ్లకు ప్రాధాన్యం ఇస్తే ఎలా అని సీరియస్ గా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం ఎలా కట్టబెడతారని విమర్శిస్తున్నారు. కీలక నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి లాంటి నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రేవంత్, లక్ష్మారెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఎంపీగా ఎంపికైనప్పటికీ నుంచి రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో చక్ర తిప్పుతుండటం.. పార్టీ నాయకులు, కార్యకర్తలు రేవంత్ వెంట నడుస్తుండటంతో లక్ష్మారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరిగింది. అధికారిక కార్యక్రమాలకు లక్ష్మారెడ్డిని ఆహ్వానించకపోవడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలను కలుపుకుపోతారా.. సొంత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని నడిపిస్తారనే అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.
Must Read:-టీపీసీసీని తేల్చే పనిలో అధిష్టానం.. రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి











