గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించి తెలంగాణ శాఖ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ- టీపీసీసీ) అద్యక్షుడిగా ఎన్నికైన పార్టీ కీలక నేత, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే నిరసనలు స్వాగతం పలుకుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. వెరసి టీ కాంగ్రెస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా… ఆయన బాటలోనే నడిచిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిదర్ రెడ్డి కూడా పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఎన్నికపై తనదైన శైలి కామెంట్లు చేసిన భువనగిరి ఎంపీ, పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక పీసీసీ పీఠం కోసం ఓ రేంజిలో యత్నాలు సాగించిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సుధీర్ఘ మంతనాల తర్వాత రేవంత్ ఎంపిక
కాంగ్రెస్ అంటేనే ముఠా రాజకీయాలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీగా అపఖ్యాతి మూటగట్టుకున్నది. ఇక తెలంగాణ శాఖలో మరింత మేర గ్రూపు రాజకీయాలు చాలా రోజుల నుంచే ఎప్పటికప్పుడు పార్టీని దిగజార్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసే విషయంపై ఎప్పట్లానే ఏఐసీసీ చాలా కాలం పాటు నాన్చుడు ధోరణిని అవలంబించింది. ఫలితంగా ఆ పోస్టును దక్కించుకునేందుకు చాలా మంది నేతలు రంగంలోకి దిగిపోయారు. వెరసి టీ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి తల భారంగా పరిణమించింది. అయితే రాష్ట్రంలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగలిగిన సత్తా కలిగిన నేత ఎవరన్న కోణంలో రోజుల తరబడి సమీక్షలు చేసిన కాంగ్రెస్ పార్టీ… ఎట్టకేలకు శనివారం నాడు రేవంత్ రెడ్డిని ఆ పదవికి ఎంపిక చేస్తూ సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన వచ్చినంతనే పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి.
లక్ష్మారెడ్డి బాటలోనే శశిధర్ రెడ్డి
రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి దక్కిందన్న వార్త తెలియగానే.. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సుధీర్ఘ కాలం పాటు పార్టీ పురోభివృద్దికి కృషి చేసిన నేతలను పక్కనపెట్టి… ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను ఈ పదవికి ఎలా అప్పగిస్తారన్నది లక్ష్మారెడ్డి వాదనగా తెలుస్తోంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా.. ఆయనతో లక్ష్మారెడ్డి ఓ రేంజిలో ఫైట్ సాగించిన వైనం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ కు పదవి దక్కగానే… పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కదన్న భావనతోనే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామం నుంచి తేరుకునేలోగానే లక్ష్మారెడ్డి బాటలోనే నడిచిన మర్రి శశిధర్ రెడ్డి… పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2017లో ఈ పదవికి ఎంపికైన శశిధర్ రెడ్డి… ఆ పదవికి రాజీనామా చేసినా.. పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. రేవంత్ రెడ్డికి ఇతర కమిటీల ఎంపికలో ఇబ్బంది ఉండకూదన్న భావనతోనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నానని శశిధర్ రెడ్డి చెబుతున్నా.. రేవంత్ కు కీలక పదవి దక్కిన అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే… టీ పీసీసీ చీఫ్ పదవి కోసం తనదైన శైలిలో యత్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి కోమటిరెడ్డికే ఈ పదవి దక్కుతుందన్న వార్తలు ఓ రేంజిలో వినిపించాయి. ఈ క్రమంలో రేవంత్ తో పాటు చాలా రోజుల క్రితమే ఢిల్లీలో తిష్ట వేసిన కోమటిరెడ్డి తన వంతుగా తీవ్ర ప్రయత్నాలే చేశారు. అయితే తన యత్నాలన్నీ విఫలమై.. తాను వద్దనుకున్న నేతకు కీలక పదవి దక్కడంతో ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంకటరెడ్డి పార్టీ అధిష్ఠానంపై తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. పార్టీకి తానెంతగా పనిచేశానన్న విషయాన్ని చెబుతూనే… ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ చీప్ ఎంపిక జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. తనను కలిసేందుకు రేవంత్ రెడ్డితో సహా చాలా మంది యత్నిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన కోమటిరెడ్డి… తనను కలిసే యత్నాలను అందరూ ఆపేయాలని సూచించారు.
జగ్గారెడ్డిదీ నిరసన గళమేనా?
ఇక టీ పీసీసీ చీఫ్ పదవికి తానే సరైన నేతనంటూ సంచలన ప్రకటనలు చేసిన జగ్గారెడ్డి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎన్నికపై స్పందించలేదు గానీ.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లుగా సమాచారం. తనకు పదవి ఇస్తే… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని, కేసీఆర్ తో పోరు సాగించాలంటే… తనను మించిన నేత లేరంటూ కూడా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకొస్తానని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ కు పదవి దక్కడంతో జగ్గారెడ్డి మింగలేక, కక్కలేని పరిస్థితిలో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా నలుదిక్కులా తనకు నిరసనలే స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో… టీ పీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి వాటన్నింటినీ చల్లబరచి పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారోనన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- రేవంత్‌కు పదవి ఇప్పించింది చంద్రబాబే నట !










