తెలుగు నేల రాజకీయాల్లో వైరివర్గాలపైకి మాటల తూటాలు పేలుతుంటాయి. ఎన్నికల సమయంలో, ఏదైనా విషయంలో వైరి వర్గాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో… ఆ మాట నిజమని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా… లేదంటే నీ ముక్కు నేలకు రాస్తావా? అంటూ తెలంగాణలో సవాళ్లు వినిపించేవి. అందుకు భిన్నంగా ఇష్ట దేవుళ్లు కొలువై ఉన్న ఆలయాల్లో ప్రమాణాలు చేద్దాం రా అంటూ ఏపీ రాజకీయాల్లో తరచూ డిమాండ్లు వినిపిస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలోకి ఈ ఏపీ సంస్కృతి చొచ్చుకెళ్లిందనే చెప్పాలి. టీఆర్ఎస్ యువ నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్… ఈ తరహాలో ఏకంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు సవాల్ విసిరారు. బండి సంజయ్ కు ఇష్టమైన సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి ఆలయంలోనే ప్రమాణం చేద్దాం రమ్మంటూ బాల్క సుమన్ బీజేపీ నేతకు సవాల్ విసిరారు.
ఆ లేఖ ఈటల రాసిందేనట
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ ఇప్పటినుంచే గ్రౌండ్‌ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 25న ఈటల పేరుతో ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు ఈటల స్వయంగా రాసినట్టుగా చెబుతున్న ఆ లేఖ ఫేక్ అని బీజేపీ చెబుతోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం అది నిజమైన లేఖనే అని వాదిస్తోంది. తాజాగా ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ అంశంపై స్పందించారు.. గతంలో ఈటల రాజేందర్ సీఎంకు ఆ లేఖ రాశారని సుమన్ చెప్పారు. అది ఫేక్ లెటర్ అని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ అది ఫేక్ లెటరే అయితే… హైదరాబాద్ చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రమాణానికి సిద్దమా అని బాల్క సుమన్… బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.
బండి సంజయ్ స్పందనేమిటో?
అంతటితో ఆగని బాల్క సుమన్… ఎన్నికల వేళ బీజేపీ నేతలు డబ్బు సంచులతో రంగంలోకి దిగుతారని గతంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను అనేందుకు మనసెలా వస్తుంది ఈటల రాజేందరన్నా అంటూ ప్రశ్నించారు. అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర బీజేపీ నేతలదని… అలాంటి నేతలు తనకే నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబం 2001 నుంచి టీఆర్ఎస్‌తోనే ఉందన్నారు. హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులని.. బీజేపీ మొసలి కన్నీళ్లను నమ్మరని… కచ్చితంగా ఆ పార్టీకి బుద్ది చెప్పి తీరుతారని అన్నారు. మరి బాల్క సుమన్ విసిరిన సవాల్ కు బండి సంజయ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. మొత్తంగా ప్రమాణాల సంస్కృతిని బాల్క సుమన్ తెలంగాణలోనూ ప్రారంబించేశారనే చెప్పాలి.











