భగవంతుడు అంటే భయం లేదు.. పాపభీతి అంతకన్నా లేదు. పట్టుమని పాతికేళ్ల వయసు కూడా లేని ఆ గ్యాంగ్ పాపం పండి పోలీసులకు చిక్కారు. దేవాలయాల్లో హుండీలే వారి ఆదాయ వనరు కావడంతో… విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఇటీవల కాలంలో వరుసగా పలు దేవాలయాల్లో హుండీల చోరీలకు తెగబడ్డారు. రెండు నెలల కాలంలోనే 19 ఆలయాల్లో హుండీలను కొల్లగొట్టారు.
పగలంతా పెయింటింగ్ పనులు…
20 – 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఆరుగురు ముఠా పగటిపూట పెయింటింగ్ పనులు ఒప్పుకుంటారు. అదేసమయంలో సమీపంలో ఆలయాలపై రెక్కీ నిర్వహిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేని ఆలయాలను… కాస్తోకూస్తో హుండీ ఆదాయం వచ్చే ఆలయాలను ఎంపిక చేసుకుంటారు. రాత్రి ఒక ఆటో పట్టుకొని శ్రమజీవుల్లా బయలుదేరుతారు. విజయనగరం టౌన్ అభయాంజనేయ స్వామి గుడి, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, విశాఖ పరవాడ లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి, అదే ఏరియా లోని మరో ఆంజనేయ స్వామి గుడి, స్టీల్ ప్లాంట్ శివాలయంలో, కూర్మన్నపాలెం, గాజువాక, కైలాసపురం అమ్మవారి దేవాలయాల్లో , చేపలుప్పాడ, లంకెలపాలెం లోని మరో రెండు దేవాలయాల్లో, వేపగుంట లోని మూడు దేవాలయాల్లో, చోడవరం లో, సబ్బవరం లోని మరో రెండు దేవాలయాల్లో వీరు హుండీలను దోచుకున్నారు. వీరిలో A1 ముద్దాయిగా ఉన్న టి. వీరబాబు 11 నేరాల్లో నిందితుడు. అలాగే A2 8 నేరాలు, A3 ఏడు నేరాల్లో నిందితులు.
వీరు శనివారం రాత్రి ఆటోలో అతి వేగంగా విజయనగరం జిల్లా శివారు ప్రాంతంలో ప్రయాణిస్తుండగా పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
చాలా దేవాలయాల నిర్వాహకులు ఫిర్యాదు చేయకపోవడమే…
హుండీ ద్వారా వీరు సంపాదించిన అత్యధిక మొత్తం 7, 500 రూపాయలు. చాలా దేవాలయాల్లో వెయ్యి నుంచి 3, 000 వరకు చోరీలకు తెగబడిన… చిన్న మొత్తం కావడంతో ఆయా దేవాలయాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. ఇదే వారికి అనుకూలంగా మారింది. హుండీలను కొల్లగొడితే పోలీసులకు ఫిర్యాదులు వెళ్ళవని.. దొరికే ప్రసక్తే ఉండదని ఆలయాలనే వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు. దైవాన్ని అవహేళన చేస్తూ… భక్తులు శ్రద్ధతో సమర్పించే కానుకలను కొల్లగొడుతూ పబ్బం గడుపుతున్న ఈ ముఠా ఎట్టకేలకు కటకటాల పాలు కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.











