బాలు జ్ఞాపకాలను మనం పదిలపర్చుకోవాల్సిన అవసరం లేదా? తన పాటలతో ఇంత చేసిన బాలుకు మనం ఎంత చేయాలి? ఇప్పుడీ ప్రశ్న రాజకీయ నాయకుల ముందు, మన పాలకుల ముందు ఉంది. ఇలాంటి విషయాల్లో వెంటనే మన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. బాలు స్వస్థలమైన నెల్లూరులో సంగీత విశ్వ విద్యాలయం నెలకొల్పాలన్నది చంద్రబాబు నాయుడు ప్రతిపాదన. ఈ మేరకు సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు.
అమర గాయకుడు బాల సుబ్రహ్మణ్యం స్మృతిని సజీవంగా నిలపడం కోసమైనా సంగీత విశ్వ విద్యాలయం నెలకొల్పాలని, అందులో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆ ప్రాంతాన్ని బాల సుబ్రహ్మణ్యం సంగీత కళా క్షేత్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వ సంగీత అకాడమీకి ఆయన పేరు పెట్టడం ద్వారా సంగీతం, ఇతర లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించి బాల సుబ్రహ్మణ్యం కల నెరవేర్చాలని అని చంద్రబాబు సూచించారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో బాపు, రమణల స్మృత్యర్థం అమరావతిలో ప్రపంచ స్థాయి కళాక్షేత్రం అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో తీర్మానించామని కూడా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.
నరసాపురంలో బాపు కళాక్షేత్రం అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతోపాటు విజయవాడలో పురావస్తు మ్యూజియానికి బాపు పేరు పెట్టామని, రాజమండ్రిలో గోదావరి తీరాన బాపు-రమణల విగ్రహాలను ప్రతిష్ఠించామని వివరించారు. విఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ స్మృతిచిహ్నంగా రూ.10 లక్షలతో జాతీయ పురస్కారం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలుగు మహనీయుల స్మృతులను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలనే యోచనతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఎన్టీ రామారావు హయాంలో 33 మంది తెలుగు మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
బాలు జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని, ఆయన పేరుతో రూ.10 లక్షల జాతీయ పురస్కారాన్ని అందించాలని కూడా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి సూచించారు. తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన బాలుకు ఆ మాత్రం గౌరవం బాలుకు దక్కాలనుకోవడం సముచితమే. బాలు విగ్రహాలను నెలకొల్పే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరో విషయం ఏమిటంటే బాలు తన మరణానికి ముందే తన విగ్రహాన్ని తనే తయారు చేయించుకోవడం. అది కూడా కాకతాళీయంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఓ శిల్పి రాజ్ కుమార్ ఇలాంటి విగ్రహాలు చేయడంలో దిట్ట. అతని గురించి తెలిసిన బాలు తన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మల విగ్రహాలు చేయించడానికి ఆర్డరిచ్చారు.
ఆ తర్వాత తన విగ్రహాన్ని కూడా చేయాలని కోరారు. తన విగ్రహాన్ని ఆయన చూడకుండానే ఆయన కన్నుమూశారు. ఇప్పుడు ఆయన అభిమానులు చాలామంది బాలు విగ్రహాలను ఏర్పాటుచేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు. ఫిలింనగర్ లోని ఫిలింఛాంబర్ ఆవరణలో ఇలాంటి లెజెండ్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. వారి సరసన బాలు విగ్రహాన్ని ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉంది. మెగాస్టార్ చిరంజీవిలాంటి వాళ్లు దీన్ని దృష్టిలోపెట్టుకుని విగ్రహం ఏర్పాటుచేయడం పెద్ద సమస్య కాదు. ఇక చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదన కూడా నెటిజన్ల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది.