కొవిడ్ నిబందనలకు అనుగుణంగానే బార్లు పని చేస్తున్నాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు చిక్కులు ఇప్పుడే ప్రారంభం అవుతున్నాయి అంటున్నారు నగర వాసులు. గడచిన ఏడు నెలలుగా హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ లు కాని, ప్రమాదాలు వాహన ప్రమాదాలు కాని లేవు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వాహనాలు రోడ్డు ఎక్కలేదు. అలాగే బార్లు, పబ్ లు మూతపడడంతో తాగుబోతుల వీరంగం తగ్గింది. ఇప్పుడు మళ్లీ బార్లు తెరచుకోవడంతో డ్రంకెన్ డ్రైవింగ్ కేసులపై పోలీసులు దృష్టి పెడుతున్నారు.
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో గతంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు భారీగా వచ్చేవి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని పైకి ప్రకటించడమే తప్ప డ్రంకెన్ డ్రైవ్ లో చలానాలు వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో మందు బాబులు తమ చిత్తం వచ్చిన రీతిన వ్యవహరించారు. కొన్నిచోట్ల అయితే మహిళలే డ్రంకెన్ డ్రైవ్ లో ఎక్కువ సార్లు దొరకడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటివి కూడా జరిగాయి. ఆ వివాదాపై మీడియా కూడా అత్యుత్సాహం చూపించిన సందర్భాలూ ఉన్నాయి.
కేసులే… కేసులు…
దాదాపు ఏడు నెలల తర్వాత బార్లు తెరచుకోవడంతో మందు బాబులు బార్లలో తాగేందుకు ఇష్టపడుతున్నారు. పైగా ఐపీఎల్ సీజన్ కూడా కావడంతో పెద్ద పెద్ద స్క్రీన్ ల మీద క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ మజా చేసుకుంటున్నారు. ఇదంతా పోలీసులకు మళ్లీ ఇబ్బందిగా మారింది. డ్రంకెన్ డ్రైవ్ కేసులు పట్టుకోవడం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, తాగిన వారితో వాగ్వాదాలు మళ్లీ ప్రారంభం కావడం పోలీసులకు తలనొప్పిగా మారుతోందంటున్నారు. కరోనా వారియర్స్ గా ఇన్నాళ్లూ పని చేసిన పోలీసులు ఇప్పుడు మళ్లీ అర్ధరాత్రిళ్లు కాపాలా కాసే పనిలో పడాలంటున్నారు.
ప్రమాదాలు పెరుగుతాయా…
బార్లు, పబ్ లు ప్రారంభం కావడంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యే అవకాశాలున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏడు నెలలుగా అడపా దడపా చిన్న చిన్న ప్రమాదాలే తప్ప పెద్దగా మరణాలు సంభవించలేదు. గతంలో జరిగిన ప్రమాదాలలో ఎక్కువ శాతం ప్రమాదాలు మద్యం కారణంగా జరిగినవే అని పోలీసులు, స్వచ్చంధ సంస్ధలు కూడా అంచనా వేశాయి. ఇప్పుడు మళ్లీ ఆ ప్రమాదాలు పెరిగితే వాటిని ఎలా కంట్రోల్ చేయాలన్నది పోలీసులకు సవాల్ గా మారింది.
బార్ల నుంచి వచ్చే వారు తమ వాహనాలను ఎలా నడుపుతారో కూడా తెలియదు. పైగా అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు శివారులోని అనేక ప్రాంతాలకు వెళ్లి బైక్ రైడింగ్ చేయడం కూడా యువతలో ఎక్కువగా ఉంది. ఏడు నెలల విరామం తర్వాత మందుతో చిందులు వేసుకుంటూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతారని భయం పోలీసులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.











