అమరావతిలోనే రాజధాని ఉంటుందని, భూములిచ్చిన రైతులకు పట్టాలిచ్చేలా ప్రభుత్వంపై ఉద్యమిస్తామని బీజీపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అయితే, అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి 350 రోజులవుతున్నా నోరు మెదపని ఆయన గ్రేటర్ ఎన్నికల ముందు ఈ హామీ ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతిలోనే రాజధాని
భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ సభ్యులు కుమారస్వామి ఆధ్వర్యంలో సోము వీర్రాజు సోమవారం సాయంత్రం అమరావతి రైతులతో భేటి అయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. భూములిచ్చిన 29 వేల మంది రైతులకు 64 వేల పట్టాలివ్వాలని, మిగిలిన 9 వేల ఎకరాల భూమి అభివృద్ధి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుంటే ప్లాట్లు తామే ఇస్తామని, భూమిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం
రాజధాని విషయంలో గత ప్రభుత్వం చెప్పిన దానిని నమ్మి వారు చెప్పినట్లు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడ రాజధాని కడతామని చెప్పి కట్టడం లేదన్నారు. టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబ పార్టీలని, అవి వారి కుటుంబాల గురించి తప్పితే ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించవని అన్నారు. కేంద్ర ఫ్రభుత్వం రాజధాని అభివృద్ధికి చేయాల్సిన వన్నీ చేసిందన్నారు. విజయవాడలో బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రారంభించామని, త్వరలో పర్మినెంట్ భవనం నిర్మిస్తామన్నారు. అమరావతి రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు.











