‘చంద్రబాబునాయుడు ఒక బ్రోకర్. బ్రోకరును సస్పెండ్ చేసి రైతులను కాపాడుతున్నాం. రైతులు పండించే పంటలను దోచుకునే దళారీ చంద్రబాబు. చంద్రబాబు నోటిని పెనాయిలుతో కడగాలి’ ఈ మాటలు అన్నదెవరో తెలుసా? గౌరవనీయ మంత్రివర్యులు కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని. నాని అంటేనే దూకుడుగా మాట్లాడడానికి ప్రసిద్ధి. అలాంటి నాని మరోసారి నోరు జారారు. అసహ్యకరమైన భాషలో చంద్రబాబును తిట్టడమే తన బతుకుతెరువులాగా వ్యవహరించే కొడాలి నాని.. మరోసారి అదే పనిచేశారు.
సోమవారం అసెంబ్లీలో చెలరేగిన రగడ, చంద్రబాబునాయుడు మాటలు, వాటికి వైసీపీ నాయకుల ప్రత్యుత్తరాలు, చంద్రబాబు- స్పీకరు పోడియం ఎదుట బైఠాయింపు.. వంటి పరిణామాల నేపథ్యంలో కొడాలి నాని మీడియా ముందు మరోమారు తన నోటి వాచాలతను ప్రదర్శించారు.
‘అసెంబ్లీ అంటే టీడీపీ ఆఫీసా..? అసెంబ్లీ ఎందుకు ఆలస్యంగా ప్రారంభమైందో స్పీకరును అడగాలి.. సీఎంను అడిగితే ఏం లాభం’ అంటూ కొడాలి నాని విరుచుకుపడ్డారు. పరిటాల రవి.. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు కాదా..? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రామానాయుడు స్టూడియోస్ దగ్గర బాంబ్ బ్లాస్టుకు కారణం చంద్రబాబేనా..? అంటూ ప్రశ్నలు సంధించారు. ‘టీడీపీ గాలి పార్టీ.. చంద్రబాబు గాలి మనిషి’ అని నాని అభివర్ణించారు.
‘మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదనే సభలో భైఠాయించారన్న నాని.. గెదేలు పెంచారా..? బర్రెలు పెంచారా..? కూరగాయలు పండించారా..? హెరిటేజ్లో అవే అమ్ముతున్నారని ఆరోపణలు గుప్పించారు. పోలవరం ఎత్తును పప్పు.. పప్పు తాత లవంగం నాయుడు వెళ్లి కొలిచారా..? అంటూ అసహ్యంగా నాని మాట్లాడడం విశేషం.
‘మేమూ ప్రజల కోసమే చంద్రబాబు అనే మాటలను పడుతున్నాం’ అని తన ఉదారతను చెప్పుకునే ప్రయత్నం చేసిన కొడాలి నాని.. తాను అంటున్న మాటలు ఎవరు ఎందుకు పడుతున్నారో అర్థం చేసుకున్నారో లేదో మరి!
చంద్రబాబునాయుడు అసెంబ్లీలో దురుసుగానే ప్రవర్తించారు. దానికి సంబంధించి సభలో జరగవలసినంత రాద్దాంతం జరగనే జరిగింది. కానీ కొడాలి నాని ఆ వ్యవహారాన్ని ప్రస్తావించి మాట్లాడిన మాటలు మాత్రం జుగుప్సాకరమైనవి. అంతకంటె మంచి మాటలు కొడాలి నాని మాట్లాడతారని కూడా ప్రజలు ఆశించడం లేదు. కానీ.. ఆయన ప్రవచించిన నీతులు చూసే నవ్వుకుంటున్నారు. చంద్రబాబునాయుడు నోటిని ఫినాయిల్ పోసి కడగాలని అంటున్న కొడాలి నాని నోటిని ఏం పోసి కడిగితే బాగుపడుతుందోనని జనం సెటైర్లు వేసుకుంటున్నారు.











