ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పనితీరును కేంద్ర బీజేపీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ పగ్గాలు సోముకు అప్పగించి తప్పు చేశామా? అని కేంద్రంలోని కొందరు బీజేపీ పెద్దలు ఆలోచనలో పడినట్టు సమాచారం. అసలే ఏపీలో బీజేపీ బలం అంతంత మాత్రంగా ఉంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాడాల్సిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు నేటికీ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుని టార్గెట్ చేస్తుండటంపై అనుమానం వచ్చిన కేంద్ర బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు వీర్రాజు కదలికలపై రిపోర్టులు తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది.
2024లో అధికారంలోకి వచ్చేంది మేమే
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సోము వీర్రాజు చెప్పే మాటలు ఇవే. కానీ అదెలాగో మాత్రం చేతల్లో చూపించరు. వీర్రాజు మీడియాకు చెబుతున్న మాటలు వింటుంటే ఏపీలో అధికారంలో ఉంది వైసీపీనా, టీడీపీనా అనే అనుమానం రాక మానదు. ఎవరైనా అధికారం కావాలనుకుంటే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వారు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఇవేమీ సోముకు గుర్తు రావడం లేదు. ఒక్కటి మాత్రం తప్పకుండా వల్లె వేస్తుంటారు… అదే 2024లో అధికారం మాదే అని.
చంద్రబాబును జైల్లో పెట్టే వరకు వదలను.. 32 సార్లు ఈ మాటే
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన 3 మాసాల్లో ఆయన 32 సార్లు ఈ మాట వాడారు. అదేనండి.. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుని జైల్లో పెట్టే వరకు వీర్రాజు వదలడట. ఈ మాటలు విని జనం నవ్వుకుంటారన్న సిగ్గు కూడా లేకుండా వీర్రాజు మీడియా ముందు వీరంగం చూస్తుంటే, ఓ నిజమే కాబోలు, చంద్రబాబుని జైల్లో పెడతారేమో అనే అనుమానం కూడా వస్తుంది. అయితే పాడిందే పాటరా, పాచిపళ్ల దాసుడా.. అన్న చందంగా వీర్రాజు ప్రతి ప్రెస్ మీట్‌లో ఇవే డైలాగులు చెప్పడంతో మీడియా ప్రతినిధులు కూడా జోకులు వేసుకుంటున్నారు. సోము ఏం చెప్పబోతున్నారో వారు ముందే ఊహిస్తున్నారట.
పదవీ గండం
బీజేపీలో పదవులను రెండు సంవత్సరాల కాలానికి భర్తీ చేస్తారు. ఏ పార్టీలో అయినా ఇదే విధానం ఉంటుంది. ఇది ఎన్నికల సంఘం నియమావళి కూడా. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు రెండు సంవత్సరాలు కూడా పదవీ కాలం పూర్తి చేసుకునేలా లేరట. వెంటనే తొలగించాలని కేంద్ర బీజేపీ పెద్దలకు ఉన్నా, ఇప్పటికిప్పుడు సోమును తొలగిస్తే, పార్టీలో తప్పుడు సంకేతాలు వెళతాయని కొంత కాలం వేచి చూడాలని పెద్దలు భావిస్తున్నారట. అందుకే సోము ఆటలు కొంతకాలం సాగే వీలుంది. కేంద్ర పెద్దల నిఘా ఉందని గమనించిన సోము కూడా దూకుడు కొంత తగ్గించుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.