కరోనా సమయంలో తన సేవా గుణంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన నటుడు సోనూ సూద్ మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. అపర దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ పై కొంతకాలంగా ఎలాంటి వార్తలు రావడం లేదు. పబ్లిసిటీకి దూరంగానే సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సోనూ చేయూతతో ఓ యువకుడు పైలెట్ అయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన సోనూ ఇప్పుడు ఓ పైలెట్ కు బాసటగా నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే ఆసక్తికర విషయాలు తెలిశాయి. పైలట్ కావాలి అనుకున్న ఓ సామాన్యుడి కలను సాకారం చేయడానికి సోనూ పూనుకోవడం విశేషం. సోనూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ యువకుడు పైలట్‌గా ఏవియేషన్ అకాడమీలో గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు.
పేదరికంలో జన్మించిన ఆ యువకుడు అనేక కష్టాలను అనుభవించాడు.పైలెట్ కావాలి అనేది ఆయన కల. కానీ అది అసంభవం అని ఎప్పుడూ అతని పేదరికం అతనికి గుర్తు చేస్తూ ఉండేది. తన విధిరాతను సైతం మార్చే ఒక మహోన్నత వ్యక్తి సోనూ సూద్ రూపంలో ఉన్నాడన్న విషయం ఆ యువకుడికి అప్పుడు గుర్తుకు రాలేదు. ఎయిర్‌లైన్‌లో హెల్పర్‌గా, క్లీనర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత, అతను ఊహించని వ్యక్తి అతని జీవితంలోకి వచ్చాడు. అతనే సోనూ సూద్.
“సోనూ సూద్ నాకు సహాయం చేశాడు. సోను సూద్ స్ఫూర్తితో ఆయన ఫౌండేషన్ కు అభ్యర్థించిన వెంటనే నేను ఆర్థిక సహాయం పొందాను” అని ఆ యువకుడు వివరించాడు. ఆ యువకుడిలో ఉన్న కోరికకు కొండంత బలం సోనూ రూపంలో లభించడంతో అతని ఆనందానికి అవధులు లేవు. అలా ఈ రోజు పైలెట్ అయ్యాడు. సోనూ సూద్ వెలిగించిన ఒక దీపం నేడు ఎందరికో వెలుగునిస్తోంది. ఆయన నింపిన ఒక స్ఫూర్తి దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. పైలెట్ అయ్యాక ఆ యువకుడు ఏమంటున్నాడంటే
“సోనూ సూద్‌ను విమానంలో ఎక్కించుకోవాలనేది నా కల, ఆ క్షణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నన్ను ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూ చేస్తున్నాయి. నిజంగా రియల్ హీరో సోనూ సూద్. స్వయంగా నా విషయంలో గర్వపడుతున్నానని చెప్పడం నా జీవితానికి అత్యుత్తమ పురస్కారంగా భావిస్తున్నాను. ఆయన ప్రోత్సాహం నా జీవితాన్నే కాదు చాలా మంది జీవితాలను కూడా మార్చేసింది. నా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత, చాలామంది ప్రజలు నాలాగే పైలట్‌లు కావాలని కోరుకుంటున్నట్టు నన్ను కలిసి చెప్పడం సంతోషంగా ఉంది. సోనూ అందించిన ఈ ప్రోత్సాహం అత్యంత పేద వాడు కూడా పైలట్ కాగలడని ప్రజల హృదయాల్లో ఆశ నెలకొంది. సోనూ సూద్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని వివరించాడు.
ఈ పైలట్ కథ సామాన్యుల్లో ఆశను చిగురింపచేస్తోంది. రియల్ హీరో సోను సూద్ తలుచుకుంటే తలరాతను మార్చిన ఈ కథనం నిదర్శనంగా నిలుస్తోంది. సమయానికి ప్రతిభావంతులకు నిజమైన హీరోలు చేయూతగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఈ కథ నిలువెత్తు సాక్ష్యం ఈ ఉదంతం.