తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల తర్వాత దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందువల్ల దుల్కర్ సినిమా విడుదలవుతుంటే అంచనాలు కూడా బాగానే ఉంటాయి. అలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
కోతా అనే నగరం కేంద్రంగా సాగే కథ ఇది. ఈ ఊరు కేంద్రంగా డ్రగ్స్ దందా సాగుతుంటుంది. ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆ ఊరులోకి ప్రవేశించడంతో కథ మొదలవుతుంది. కన్నా భాయ్ ఆటకట్టించడమే సీఐ లక్ష్యం. కన్నాను ఎదుర్కోవడం అంత తేలిక కాదని సీఐకి అర్థమవుతుంది. కన్నాకి చిన్న నాటి మిత్రుడు రాజు (దుల్కర్)వల్లే కన్నాని అంతమొందించడం సాధ్యమని నిర్ణయించుకుంటారు. ముల్లును ముల్లుతోనే తీయాలని పోలీసులు భావించడంతో రాజుకు సంబంధించిన కథంతా సీఐ తెలుసుకుంటాడు. కానీ రాజు ఆ ఊరు విడిచి ఎప్పుడో వెళ్లిపోయాడు. అతను ఊరు విడిచి ఎందుకు వెళ్లిపోయాడు? కన్నాతో రాజుకు ఎందుకు శతృత్వం ఏర్పడింది? అతన్ని కోతాకు రప్పించేందుకు సీఐ ఏంచేశాడు? కన్నాని రాజు ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్ర కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
యాక్షన్ థ్రిల్లర్ కథాంశం కాబట్టి సినిమా అంతా మాస్ ఎలిమెంట్స్ తోనే సాగుతుంది. చెప్పాల్సిన కథను దర్శకుడు సుదీర్ఘంగా చెప్పడం విసుగు కలిగిస్తుంది. 1996వ సంవత్సరంలో ఈ కథను జరిగినట్టుగా చెప్పడంలో దర్శకుడి ఉద్ధేశం ఏమిటో అర్థం కాలేదు. తెలుగు నేటివిటీకి దూరంగా సినిమా ఉంది. బీజీఎం బాగుంది. పాటలకు అవకాశం లేని సినిమా ఇది. రాజుగా దుల్కర్ నటన బాగుంది. కన్నా పాత్ర పోషణలో షబీర్ మెప్పించాడు. సీఐగా ప్రసన్న బాగా చేశాడు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పాత్ర నామ్ కేవాస్తే అన్నట్టు ఉంది.
తెలుగు వెర్షన్ డబ్బింగ్ రచయిత లోపాలు స్పష్టంగా కనిపించాయి. అన్వయ లోపాలతో డైలాగులు రాసిన సినిమాగా చెప్పొచ్చు. ఇంత నిడివితో సినిమా తీయాల్సిన అవసరం లేదు. చిన్న కథను పెద్దగా ఎందుకు చెప్పాలనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. కథ క్లైమాక్స్ కు చేరే కొద్దీ సాగదీత కొనసాగింది. సినిమా టైటిల్ లోనే గందర గోళం ఉంది. అది కోతా నగరం. మరి కొత్త అని టైటిల్ ఎందుకు పెట్టారో? కథ కొత్త అని మాత్రం ప్రేక్షకులు ఫీలవలేదు.
నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రసన్న, షబీర్ కల్లారక్కల్, గోకుల్ సురేష్, నైలా ఉష
సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి
ఎడిటింగ్: శ్యామ్ శశిధరన్
సంగీతం: జేక్స్ బెజాయ్, శాన్ రెహ్మాన్
నిర్మాతలు: దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్
దర్శకుడు : అభిలాష్ జోషీ
విడుదల తేదీ : ఆగస్టు 24, 2023
ఒక్క మాటలో: కథలో కోత
రేటింగ్: 2/5