విశాఖలో ప్రైవేట్ యూనివర్శిటీ స్థాపన వెనక విజయసాయి రెడ్డి భారీ వ్యూహం..??
బిజినెస్ పాలిటిక్స్.. పొలిటికల్ బిజినెస్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే రాజకీయం వ్యాపారం ఒకదానికొకటి విడదీయలేనంతగా కలిసిపోయాయా అనిపించక మానదు. వైసీపీ ఎంపీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి కుటుంబం.. బిజినెస్-పొలిటికల్ నెక్సస్‌కి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్‌గా దశాబ్దాల అనుభవం ఉన్న విజయసాయి రెడ్డి, జగన్ వ్యాపార సామ్యాజ్యానికి ప్రధాన రూపకర్త అని చెప్పుకుంటారు. వైఎస్సార్ వారసుడైన జగన్‌మోహన్‌రెడ్డికి లక్షల కోట్ల బిజినెస్ ఎంపైర్‌ని నిర్మించిన విజయసాయి రెడ్డి.. తన వారసులకూ అదే స్థాయి వ్యాపార సమ్రాజ్యాన్ని నిర్మించడంలో తలమునకలై ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంఛార్జిగా విజయసాయిరెడ్డిని నియమించారు జగన్. అప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన విజయసాయి కుటుంబ వ్యాపారాలు.. విశాఖలోనూ విస్తరించడం మొదలయింది ఆ సమయంలోనే. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, విశాఖ నగర శివారులో ప్రైవేటు యూనివర్శిటి ప్రారంభించడానికి సిధ్దమవడంతో, ఉత్తరాంధ్రలో వీరి కుటుంబ భూదందాలు వెలుగులోకి వచ్చాయి.
విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో వేల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్‌లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.. అందుకే, ఆయనను ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ పదవి నుండి తప్పించారని, పార్టీ పరువు కాపాడుకోవడం, రాబోయే ఎన్నికలలో విశాఖలో పాగా వేయడానికి విజయసాయి రెడ్డి స్థానంలో బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారనే ప్రచారం ఉంది. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలకు దూరం అయినా ఆయన మనసు అక్కడే ఉందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి ఏకంగా ఓ ప్రయివేట్ యూనివర్శిటీకి ప్లాన్ చేస్తున్నారు. దీంతో, మరోసారి విజయసాయి రెడ్డి ఫ్యామిలీ, ఆయన ఆర్ధిక సంబంధాలపై జనాల ఫోకస్ పడింది.
నేహారెడ్డి భర్త రోహిత్ రెడ్డి.. అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్. మనదేశంతో పాటు అనేక దేశాల్లో వేలకోట్ల ఫార్మాస్యూటికల్ బిజినెస్ చేస్తున్న అరబిందో సంస్థ.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు అరబిందో రియాలిటీ, ఫార్మా కంపెనీతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. అరబిందో రియాల్టీ ఎదుగుదలకు రాజకీయ సంబంధాలు ఎంతగా ఉపయెగపడ్డాయో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఫార్మా రియాలిటీతో పాటు లిక్కిర్ బిజినెస్‌లోనూ వీరి కుటుంబం భారీ దందాలే నడుపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి అన్న శరత్‌చంద్రారెడ్డి అరెస్టవడంతో వీరి మద్యం వాపారం వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం, కేసు నుంచి బయటపడటంలో.. తెరవెనుక నుండి విజయసాయిరెడ్డి నడిపిన రాజకీయాలే ప్రధానమని అంటారు.
ఐటీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సత్యం కంప్యూటర్స్.. రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా బిజినెస్‌లోకి ప్రవేశించి అడ్రస్ లేకుండా పోయింది. అరబిందో ఫార్మా.. సత్యం కంప్యూటర్స్ దారిలో కాకుండా.. రియాల్టీ బిజినెస్లోనూ ఉన్నత స్థాయికి ఎదిగింది. అరబిందో రియాల్టీ ఈ స్థాయిలో నిలవడానికి బిజినెస్ మైండ్‌తో పాటు కంపెనీకి ఉన్న రాజకీయ సంబంధాలు కూడా కారణమే అని చెప్పుకోవచ్చు. విశాఖలో అరబిందో కంపెనీ పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ప్రైవేటు యూనిర్శిటీ వివాదాస్పదంగా మారింది. ఈ యూనివర్శిటీని ప్రమోట్ చేయడానికే గీతం విద్యా సంస్థలపై జగన్ సర్కార్ దాడి చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన గీతం యూనివర్శిటీ నుంచి.. కొత్త సంస్థకు విద్యార్ధులకు మళ్లించడానికే ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ప్రత్యర్ధుల ఆరోపణ.
గతంలో వైఎస్ రాజశేఖర్.. ఆ రెండు పత్రికలు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత తమకంటూ ఓ పేపర్, చానెల్ ఉండాలని సాక్షి మీడియాని తెరమీదకి తెచ్చారు.. ఆయన ఉద్దేశ్యం ఎలా ఉన్నా.. సాక్షి మీడియా విషపత్రిక అని, జగన్ ఎజెండాకి మానస పుత్రిక అని విమర్శకుల మాట. ఇదే తరహాలో వైఎస్ వ్యూహాన్నే అనుసరించి గీతం యూనివర్శిటీపై భారీ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టి టార్గెట్ చేశారని, ఆ యూనివర్శిటీ క్రెడిబులిటీ దెబ్బకొట్టాలనే లక్ష్యంతోనే ఇది చేశారని తాజాగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు రాజకీయ పండితులు.
దశాబ్దాలకుపైగా గీతం సంస్థ యాజమాన్యం విద్యలో రాణించింది.. అలాంటి యూనివర్శిటీని కావాలనే రాజకీయాలలోకి లాగారని తాజా అంశంతో ప్రూవ్ అవుతోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు..
యూనివర్శిటీ కోసం ప్రభుత్వం నుంచి 120 ఎకరాలు తీసుకుంటున్న నేహారెడ్డి.. మధురవాడలో మరో 70 ఎకరాలు చేజిక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు నగరంలో ఖరీదైన రాడిసన్ బ్లూ రిసార్ట్, బే పార్క్ హోటల్స్‌లో పెద్దమొత్తంలో వాటాలు కొనుగోలు చేశారు. ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ పదవి పోయినా.. విశాఖలో విజయసాయిరెడ్డి కుటుంబ వ్యాపారాలు విస్తరణ మాత్రం శరవేగంగా దూసుకుపోతోంది. ఈ కొత్త యూనివర్శిటీ ప్రారంభానికి ముందే భారీ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి యూనివర్శిటీలలో ఎలాంటి విద్య అందిస్తారో అని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.