సంక్రాంతి అంటే సంతోషం .. సంబరం .. సందడి .. సఖ్యత అని చెప్పుకోవచ్చు. ఆనందాలు .. అనుబంధాలు .. ఆత్మీయతల కలయిగా అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా సూర్యభగవానుడు ప్రతి మాసంలోను ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఇలా ప్రవేశించిన సూర్యభగవానుడినే ‘సంక్రాంతి పురుషుడు’ అని చెబుతారు. సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి ఉంది. సమస్త జీవరాశికి అవసరమైన ఆహారాన్ని అందించేవాడు సూర్యభగవానుడేనని ప్రాచీనకాలం నుంచి విశ్వసిస్తూ వస్తున్నారు. అందువల్లనే సూర్యుడిని .. సూర్యనారాయణమూర్తిగా భావిస్తూ .. పూజిస్తూ ఉంటారు.
సూర్యుడి యొక్క అనుగ్రహం వల్లనే సకాలంలో పంటలు పండుతాయి .. పశువులు వృద్ధి చెందుతాయి. ఇటు పాడి .. అటు పంట .. సూర్యభగవానుడి అనుగ్రహంతోనే మానవులు పొందుతూ ఉంటారు. తొలిపంటగా ఇంటికి వచ్చిన ‘కొత్త బియ్యం’తో ఆ స్వామికి పాయసం చేసి నైవేద్యంగా సమర్పించి, కృతజ్ఞతను తెలుపుకోవడం ఈ పండుగలోని పరమార్థంగా కనిపిస్తుంది. సంక్రాంతి పండుగను పల్లె .. పట్నం అనే తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు. కాకపోతే ఇది వ్యవసాయ ప్రధానమైన పండుగ కనుక, పల్లె పండుగగానే కనిపిస్తుంది.
సంక్రాంతి రోజుల్లో ప్రతి పల్లె .. ప్రతి వీధి కళకళలాడుతూ కనిపిస్తాయి. అమ్మాయిలంతా కూడా ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో ‘గొబ్బెమ్మ’లను ఉంచుతారు. ఆ గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో అలంకరించి, పూలు అర్పించి – రేగుపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. తాము గోపికలుగా మారిపోయి ఆ రంగవల్లుల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఇక అబ్బాయిలు ఎంతో ఉత్సాహంగా ‘గాలి పటాలు’ ఎగరేస్తారు. పోటీలు పడుతూ కేరింతలు కొడతారు.
వయసులో మరో వరుసలో కనిపించేవాళ్లు కోడి పందాలు .. ఎడ్ల పందాలతో సందడి చేస్తుంటారు. పండగకి రానున్న తమ కూతుళ్లు – అల్లుళ్లు .. మనవాళ్లు .. మనవరాళ్ల కోసం రకరకాల పిండివంటలు చేయడంలో స్త్రీలుతీరికలేకుండా ఉంటారు. ఇంటి యజమానులు కొత్త అల్లుళ్లకు చేయవలసిన మర్యాదలను దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఇక పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలంతా తమ స్నేహితులను కలుసుకుని పాత జ్ఞాపకాలను గురించి చెప్పుకునే కబుర్లలో మునిగిపోతారు. కొత్త అల్లుళ్ల పరిచయాలతో పల్లె మరింత సరదాగా .. సందడిగా కనిపిస్తుంది. ఇలా సంక్రాంతి .. అన్ని వయసులవారికి సంబంధించిన పండుగ అనిపిస్తుంది.
‘భోగి’ .. ‘సంక్రాంతి’ .. ‘కనుమ’ .. ఇలా కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను మూడు రోజులపాటు జరుపుతారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆ తరువాత రోజైన ‘ముక్కనుమ’ను కూడా చేర్చి నాలుగు రోజుల పాటు చేస్తారు. భోగములను సమకూర్చిపెట్టేదే ‘భోగి’ అని అంటారు. ఈ రోజు ఉదయాన్నే ఆవు పిడకలతో ప్రతి ఇంటి ముంగిట ‘భోగిమంట’ వేసుకోవడం జరుగుతుంది. ఇంట్లోని పనికిరాని పాత వస్తువులను కూడా ఆ మంటల్లో వేయడం చేస్తారు. పనికిరాని వస్తువుల నుంచి నెగెటివ్ ఎనర్జీ విడుదలవుతుందనీ .. అందువల్లనే వాటిని వదిలించుకోవాలనే ఆంతర్యం ఇందులో కనిపిస్తుంది.
‘భోగి’ రోజున తలస్నానం చేసిన తరువాత గోదాదేవి – రంగనాయకస్వామిని స్మరించుకోవడం .. దర్శించుకోవడం విశేషమైన ఫలాలను ఇస్తుంది. సాక్షాత్తు శ్రీరంగనాథుడిని మధురభక్తితో సేవించిన ‘గోదాదేవి'(ఆండాళ్) ఈ రోజునే స్వామివారిని వివాహమాడింది. అందువలన ఈ రోజున వైష్ణవ క్షేత్రాల్లో గోదాదేవి .. రంగనాయకుల వివాహ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ వివాహాన్ని తిలకించి .. ప్రసాదాన్ని స్వీకరించడం వలన, కన్నెపిల్లలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని అంటారు. ఈ రోజునే చిన్నపిల్లలకు ‘భోగిపండ్లు’ పోస్తారు. రేగిపండ్లకి గల ఔషధ గుణాల కారణంగా .. రేగిపండ్లను ఇష్టపడే నారాయణుడి అనుగ్రహం కారణంగా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనీ, దృష్టి దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
‘భోగి’ రోజుతో దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది. దేవతలకు ‘పగలు’ (మధ్యాహ్న కాలం)గా చెప్పబడే ‘ఉత్తరాయణ పుణ్యకాలం ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ‘సంక్రాంతి’ రోజున తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి. సూర్యభగవానుడిని పూజించి నైవేద్యాలు సమర్పించాలి. ఆ తరువాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. వాకిట్లోకి వచ్చిన ‘బసవన్న’కు లేదనకుండా ఆహారాన్ని అందించాలి. హరిదాసుల భోజనానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చాలి. ఈ రోజున చేసే దానధర్మాల వలన విశేషమైన ఫలాలు కలుగుతాయనేది శాస్త్ర వచనం. ఈ రోజున బెల్లం .. నువ్వులతో తయారు చేసిన పిండివంటలను ఆరగించాలి.
ఇరుగు పొరుగువారు ఒకరి పిండివంటలను మరొకరికి పంపించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక పాడి సమృద్ధిగా అందించడంలో ఆవులు ఎంతగా సహకరిస్తాయో, పంటలు బాగా పండి .. అవి యజమాని ఇంటికి చేరడంలో ఎద్దులు అంతగా సాయపడతాయి. అందువలన ‘కనుమ’ రోజున వాటిని శుభ్రంగా కడిగేసి .. నుదుటున బొట్టుపెట్టి .. పూలమాలలతో అలంకరిస్తారు. ఆవులకు .. ఎద్దులకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఆ రోజున వాటికి ఎలాంటి పనులు చెప్పకుండా విశ్రాంతిని ఇస్తారు. అలా తమ శ్రమలో భాగస్వామ్యమైన వాటి పట్ల కృతజ్ఞత చూపుతారు.
మనిషి సంఘజీవి .. ప్రకృతిని రక్షిస్తూ .. దాని నుంచి తన జీవనానికి అవసరమైన ఆహారాన్ని పొందుతాడు. ప్రకృతి అందించిన దానిని పదిమందితో పంచుకుంటాడు. తమపట్ల విశ్వాసంగా మెలగుతూ ఉండే పశువుల సంరక్షణను కూడా తన బాధ్యతగా భావిస్తాడు. ఆ విషయాన్ని స్పష్టం చేసేదిగా ‘సంక్రాంతి’ పండగ కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ‘భోగి మంటలు’ వేయడం .. పిండితో ముగ్గులు పెట్టడం .. ఆవుపేడతో గొబ్బెమ్మలు పెట్టడం .. బెల్లం – నువ్వులు కలిపిన పిండివంటలు తినడం .. ఇవన్నీ కూడా ఈ మాసంలోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన ఆరోగ్య సూత్రాలుగా కనిపిస్తాయి.
సంక్రాంతికి ఇంటికి చేరిన ధాన్యం లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది. ఇక ఆ ధాన్యం ఇంటికి చేరడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించిన సూర్య భగవానుడు .. శ్రీమన్నారాయణుడుగా భావించబడుతున్నాడు. ఇక గంగిరెద్దులు ఆడించేవారు శివస్వరూపాన్ని గుర్తుచేస్తే .. హరిదాసులు కేశవుడి వైపు మనసును మళ్లిస్తారు. ప్రకృతి మాతగా పార్వతీదేవి దర్శనమిస్తుంది. ఇలా లక్ష్మీనారాయణులు .. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందేదిగా ‘సంక్రాంతి’ కనిపిస్తుంది. అందరినీ ఒకచోట చేర్చేది .. అందరినీ ఒకటిగా చేసేది పండుగే అయితే, అది ‘సంక్రాంతి’ పండగేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
– పెద్దింటి గోపీకృష్ణ