ఒక చిన్న సినిమా థియేటర్ కి రావడానికి పురిటి నొప్పులు పడవలసి ఉంటుంది. థియేటర్స్ దొరకడమే కష్టమైపోతుంది .. ఒకవేళ వెళ్లినా అక్కడ ఎంతవరకూ గిట్టుబాటు అవుతుందన్నది తెలియదు. థియేటర్స్ దొరికేవరకూ వెయిట్ చేస్తూ కూర్చుంటే, ఇవతల వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. అందువలన అటు తొందరపడలేరు .. ఇటు నిదానంగా నిరీక్షించలేరు అన్నట్టుగా ఉంటుంది చిన్న నిర్మాతల పరిస్థితి.
ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వచ్చిన తరువాత చిన్న నిర్మాతల దిగులు కొంతవరకు తీరింది. అయితే ఓటీటీ వైపు నుంచి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమే వాళ్లు సినిమాను తీసుకోవడం .. తిరస్కరించడం ఉంటాయి. ఈ ప్రాసెస్ లోను నిర్మాతలు కొంత టెన్షన్ పడటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా నిర్మాతలే నేరుగా తమ సినిమాలను పబ్లిష్ చేసుకునే వీలును కల్పిస్తూ ‘HIT’ అనే ఫ్లాట్ ఫార్మ్ అందుబాటులోకి వచ్చింది. బోస్టన్ కి చెందిన తెలుగు ఎన్నారై రంజిత్ కొల్లు .. అతని మిత్రుడు వెంకట్ కలిసి ఈ ఫ్లాట్ ఫార్మ్ ను సెట్ చేశారు.
ఈ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా నిర్మాతలు నేరుగా తమ సినిమాలను పబ్లిష్ చేసుకోవచ్చు. తమ సినిమా కంటెంట్ ను బట్టి అది ఏ ప్రాంతాలవారికి ఎక్కువ రీచ్ అవుతుందనేది ఒక ఐడియా ఉంటుంది గనుక, దానిని బట్టే వాళ్లు ఆయా దేశాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం నిర్మాతలు మూవీ మాస్టర్ ఫైల్ తో పాటు, తమ సినిమా వివరాలతో కూడిన విషయాలతో కేవైసీ డాక్యుమెంట్స్ ను ఫిలిప్ చేసి అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్మాతలకు మరింత లాభసాటిగా ఉంటుంది. డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటే 72 గంటల లోపు స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ విధానంలో నిర్మాతకు టికెట్ పై రాబడిలో 70 శాతం ముడుతుంది.150 దేశాల పరిథిలోని వారికి తమ సినిమా రీచ్ అవుతుంది.











