అదో బారాత్ వేడుక. వివాహం నేపథ్యంలో జరిగే సందడి కార్యక్రమం. ఇటు వరుడితో పాటు వధువు బంధువర్గమంతా పదం, పాదం కదిపే వేడుక. ఆడిపాడే ముచ్చట. సాధారణంగా ఈ వేడుకల్లో వరుడితో పాటు వధువు కూడా ఒకింత బడియంతో కూర్చుని ఉంటారు. బంధువర్గం చేసే సందడిని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సంపన్న కుటుంబాలకు చెందిన వధూవరులైతే.. బంధువర్గంతో కలిసి ఆడిపాడతారు. మరింత సందడి చేస్తారు. మన తెలుగు నేలకు చెందిన ఓ పెళ్లి కూతురు.. అచ్చ తెలుగు చీరకట్టులో డ్యాన్స్ ను ఇరగదీసింది. బారాత్ లో తన మెడలో తాళి కట్టిన భర్త.. అలా చూస్తూ ఉండగా.. బంధువర్గమంతా కళ్లప్పగించి చుట్టూ నిలుచుండగా.. ఈ వధువు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మొత్తంగా తన భర్తకు డెడికేట్ చేసిన ఈ డ్యాన్స్ ఆమెను ఏకంగా సెలబ్రిటీని చేసేసింది.
భర్తకు గిఫ్ట్ గా డ్యాన్స్ చేసిందట
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జిన్నారం పట్టణం వినాయక నగర్ కాలనీకి చెందిన పయ్యావుల రాము తన కుమార్తె సాయిశ్రేయను అశోక్ అనే యువకుడితో వివాహం జరిపించారు. జిల్లాలోని పోనకల్ లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఆ తర్వాత తమ ఇంటికి వరుడిని తీసుకొచ్చే క్రమంలో ఏర్పాటు చేసిన బారాత్ లో అందరూ ఆశ్చర్యపోయేలా సాయి శ్రేయ.. తన భర్త అశోక్ కు ఓ మరుపురాని గిఫ్ట్ ను ఇచ్చింది. కారు దిగిన వరుడిని అక్కడే నిలబెట్టేసి.. మాంచి రిథమ్ ఉన్న సింగర్ మోనా భోగరాజ్ రాసిన ‘నీ బుల్లెట్టు బండెక్కి’ పాటకు డ్యాన్స్ మొదలెట్టేసింది. 4 నిమిషాలకు పైగా ఉన్న ఈ పాటకు ఏమాత్రం అలుపు సొలుపు అన్న మాటే లేకుండా సాయిశ్రేయ.. అచ్చూ సినిమా హీరోయిన్ మాదిరిగా డ్యాన్స్ ను ఇరగదీసేసింది. ఈ డ్యాన్స్ తో తన తండ్రి, సోదరులు కూడా ఆమెతో పాదం కలిపారు. తనకు గిఫ్ట్ గా తన భార్య చేస్తున్న ఈ డ్యాన్స్ ను చూసి అశోక్ నిజంగానే మైమరచిపోయాడు. బంధువర్గం అయితే ఈలలు, కేకలతో హోరెత్తించారు.
టాప్ ట్రెండింగ్ లో వీడియో
సాయి శ్రేయ తన భర్తకు గిఫ్ట్ ఇస్తూ మైమరచిపోయి డ్యాన్స్ చేస్తుంటే.. ఆమె బంధువులు కొందరు ఈ మొత్తం డ్యాన్స్ ను వీడియో తీశారు. ఆపై దానిని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అంతే.. చీరకట్టులో సాయిశ్రేయ చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్ ను షేక్ చేసింది. గంటల వ్యవధిలోనే టాప్ ట్రెండిగ్ లోకి వెళ్లిపోయింది. మొత్తంగా పెళ్లికూతురు వస్త్రధారణలో సాయి శ్రేయ చేసిన డ్యాన్స్.. ఆమెను ఇప్పుడు సెలబ్రిటీని చేసింది. తన సతీమణి చేసిన ఈ వీడియో వైరల్ కావడంపై అశోక్ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. ఇంత హంగామా జరుగుతున్నా.. అదేమీ తెలియదన్నట్లుగా తనను పెళ్లి చేసుకున్న తన భర్తకు తొలి గిఫ్ట్ గా ఏదైనా వెరైటీ చూపించాలన్న ఆలోచనతోనే ఈ డ్యాన్స్ చేశానంటే సాయి శ్రేయ చాలా సైలెంట్ గానే చెబుతోంది. పాటలో ప్రతి పదానికి అనుగుణంగా స్టెప్పులేసిన సాయిశ్రేయపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Must Read ;- ఇక్కడ కల్యాణ మండపం.. వధూవరులెక్కడ?











