Rajisha Vijayan :
టాలీవుడ్ తెరపై మలయాళ భామల జోరు ఎక్కువ. వాళ్ల హవానే ఇక్కడ ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. అందం .. అభినయం విషయంలో వాళ్లు తమ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆల్రెడీ కొంతమంది మలయాళ బ్యూటీలు స్టార్ హీరోయిన్స్ రేసులో వుంటే, మరికొందరు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు. ఇక కొత్తగా వచ్చేవారు వస్తూనే ఉన్నారు. అలా తాజాగా మరో మందారం వంటి అమ్మాయి తెలుగు తెరకి పరిచయం కానుంది. ఆ సుందరి పేరే ‘రజీషా విజయన్.
రజీషా విజయన్(Rajisha Vijayan) .. చూడగానే సౌందర్యరాశి అనిపించకపోయినా, ఆమెలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉందనే విషయం మాత్రం వెంటనే అర్థమైపోతుంది. ఆమె కొంటె కళ్లు .. చిలిపి చూపులు .. చిరుమందహాసం అంతటి ఆకర్షణకు కారణమేమో అనిపిస్తుంది. ఈ మధ్యనే ఆమె మలయాళ తెరపై మెరిసింది. కథానాయికగా అక్కడ దాదాపు కుదురుకున్నట్టే. అక్కడ పేరున్న హీరోల సరసన ఆమెకు అవకాశాలు బాగానే ఉన్నాయి. చాలా తక్కువ సమయంలోనే అక్కడ నాయిక ప్రధానమైన సినిమాలు చేసిందంటే ఆమె ప్రతిభ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
తమిళంలో ‘కర్ణన్‘ సినిమా ద్వారా ఆమె పరిచయమైంది. ధనుశ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. రజీషా నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె అటు సూర్య .. ఇటు కార్తి సినిమాల్లో నాయిక పాత్రలను పోషిస్తూ ఉండటం విశేషం. ఈ రెండు సినిమాల్లోను ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందట. ఇక ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రవితేజ హీరోగా చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమాతో ఈ అమ్మాయి పరిచయమవుతోంది. ఈ రోజునే ఈ అమ్మాయి ఇక్కడ షూటింగులో జాయిన్ అయింది. ఇక ఇక్కడి ప్రేక్షకులు ఆమె అందానికి .. అభినయానికి ఎన్నేసి మార్కులు ఇస్తారో చూడాలి.
Must Read ;- ‘ఖిలాడి’ రవితేజతో రమేష్ వర్మకు చెడిందా?











