దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్సార్టీపీకి త్వరలోనే శుభం కార్డు పడనుందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పార్టీ పెట్టిన నెలల వ్యవధిలోనే వరుస దెబ్బలు తిన్న ఆ పార్టీకి ఇప్పుడు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపారు. తనకు పార్టీలో పని చేసే అవకాశం కల్పించిన సోదరి షర్మిలకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.
ఇందిర లక్ష్యం ఇదే
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, అమరవీరుల ఆశయాల సాధన కోసం, నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, మైనార్టీల బతుకుల బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం తాను కొట్లాడుతూనే ఉంటానని ఇందిర తెలిపారు. అందుకే షర్మిలక్క పార్టీలో ఉండకూడదని.. శ్రేయోభిలాషులు, అభిమానులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. జనం కోసం అడుగులు వేస్తానని తెలిపారు. ఇందిర ప్రస్తావించిన అంశాల్లో చాలా వాటిని షర్మిల కూడా ప్రస్తావిస్తున్నారు. ఏకంగా ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా షర్మిల పార్టీ నుంచి ఆమె బయటకు రావడం వెనుక వ్యూహమేమిటన్నది తెలియడం లేదు. వైఎస్సార్టీపీకి ఇందిర రాజీనామా పరిణామాలను చూస్తుంటే.. తెలంగాణ జనం షర్మిలను ఇంకా తమ సొంతం అనుకోవడం లేదని, పరాయి నాయకురాలిగానే షర్మిలను భావిస్తున్నారన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది.
షర్మిల పార్టీలో కీలక నేతగా..
వైఎస్సార్టీపీకి ఇప్పటికే ఒకరిద్దరు నేతలు రాజీనామా చేశారు. ఇందిరా శోభన్ కూడా రాజీనామా చేస్తారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నప్పటికీ.. ఆ వార్తలపై ఆమె స్పందించలేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఇందిరా.. హస్తం పార్టీని వీడి షర్మిల పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంతో.. ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ కావడంతోనే ఇందిరా షర్మిల పార్టీని వీడినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంతకాలం వైఎస్సార్టీపీలో ఇందిర కీలకపాత్రను పోషిస్తూ వచ్చారు. పార్టీ సభలు, సమావేశాల్లో కీలకంగా వ్యహరించారు. డిబేట్స్ లో పార్టీ గొంతుకను బలంగా వినిపించారు. ఓ రకంగా ప్రతి కార్యక్రమంలోనూ ముందువరుసలో కనిపించిన ఇందిరా.. వైఎస్సార్టీపీలో మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తారన్న వాదనలు వినిపించాయి. అయితే పార్టీ ఏర్పాటైన నెలల వ్యవధిలోనే ఆమె షర్మిలకు షాకిచ్చారు. వరుసపెట్టి కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో షర్మిల కూడా తన పార్టీని త్వరలోనే మూసేస్తారన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- రేవంత్ సత్తా.. ‘ఇంద్రవెల్లి’ గ్రాండ్ సక్సెస్











