Telangana Skip Godavari Krishna Boards Meeting :
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడానికి శాశ్వతంగా చెక్ పెట్టేలా సాగుతున్న చర్యలకు అసలు తెలంగాణ అనుకూలమో, లేదంటే వ్యతిరేకమో కూడా తెలియడం లేదు. జలాల పంపిణీకి సంబంధించి కుదిరిన ఒప్పందాలను ఏపీ తుంగలో తొక్కుతోందని ఆరోపిస్తున్న తెలంగాణ సర్కారు..సోమవారం నాడు తన జరిగిన ఓ కీలక భేటీకి మాత్రం డుమ్మా కొట్టేసింది. అంతేకాకుండా ఈ వివాదంలో తన ప్రత్యర్థిగా ఏపీ సర్కారు ఈ భేటీకి హాజరైనా కూడా తెలంగాణ సర్కారు మాత్రం గైర్హాజరు కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ సమావేశం బయట ఎక్కడో జరగలేదు. తెలంగాణ భూభాగంలోనే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని జలసౌధలోనే ఈ భేటీ జరిగింది. అంటే.. తన భూభాగం పరిధిలో జరిగిన కీలక భేటీకి తెలంగాణ సర్కారు హాజరు కాలేదన్న మాట.
కలహాలతో ఎంత నష్టమంటే..?
తెలుగు రాష్ట్రాల మధ్య అటు గోదావరి జలాలతో పాటు ఇటు కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గోదావరి జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య పెద్దగా విభేదాలు లేకున్నా.. కృష్ణా జలాల పంపకానికి సంబంధించి మాత్రం ఇరు రాష్ట్రాలు జట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల వరుస ఫిర్యాదులు, వివాదాన్ని పరిష్కరించాలన్న అభ్యర్థనల నేపథ్యంలో ఈ రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులు, నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్వహణలను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ రెండు బోర్డుల ఖర్చులు మాత్రం ఇరు రాష్ట్రాలే భరించాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల చేసింది. మొత్తంగా రెండు రాష్ట్రాలు పరస్పరం కొట్లాడుకుని.. ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుల చేతిలోకి నెట్టేశాయన్న మాట.
రెండు బోర్డుల ఉమ్మడి భేటీ
ఈ నేఫథ్యంలో అటు గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)తో పాటు ఇటు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)లు చాలా రోజుల నుంచి ఇరు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని చూస్తున్నాయి. అయితే ఈ భేటీలు జరగకుండా ఎప్పటికప్పుడు వాయిదా మంత్రాన్ని పటిస్తూ వస్తున్న తెలంగాణ సర్కారు..కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై అటు సుప్రీంకోర్టుతో పాటు ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)లోనూ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ విఛారణలు ముగిస్తే తప్పించి తాము భేటీలకు హాజరు కాలేమని కూడా తెలంగాణ చెబుతోంది. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ లోని జలసౌధలో రెండు బోర్డులు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి ఏపీ ఈఎన్సీతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. అయితే తెలంగాణ తరఫు నుంచి ఒక్క అధికారి కూడా హాజరు కాలేదు. అంతేకాకుండా సుప్రీంకోర్టు, ఎన్జీటీల్లో విచారణలో ఉన్న పిటిషన్ల పేరును మరోమారు ప్రస్తావిస్తూ.. ఆ పిటిషన్ల విచారణలు ముగిసేదాకా భేటీకి రాలేమని తెలంగాణ తెలిపింది. ఈ నేపథ్యంలో భేటీకి సంబంధించి మరో తేదీని తెలపాలంటూ తెలంగాణ కోరింది.
Must Read ;- అటు ఎన్జీటీ, ఇటు మావోయిస్టులు.. వైసీపీకి బ్యాండ్ బాజానే