సుమ అంటే మాటల జలపాతం .. సుమ అంటే ‘పంచ్’ల ప్రవాహం .. సుమ అంటే చమత్కారాల విన్యాసం. స్టేజ్ ఎక్కితే చాలు సుమ ‘ఉప్పెన’ వంటి ఊత్సాహంతో కనిపిస్తుంది .. ఎలాంటి ఉత్సవాన్నైనా సరే అదే ఉత్సాహంతో నడిపిస్తుంది. అందువల్లనే యాంకర్ గా సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో సుమకి తిరుగులేకుండా పోయింది.
స్వతహాగా తను మలయాళీ .. అయినా ఆమె తెలుగులో ఆ యాస కనిపించదు .. వినిపించదు. ఓ మలయాళీ అమ్మాయి ఎంతమాత్రం తడుముకోకుండా .. తడబడకుండా అచ్చతెలుగులో అదరగొట్టేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. స్టేజ్ పై సుమని ఎదుర్కోవడం చాలా కష్టమనే విషయం చాలామందికి తెలుసు. ఆమె మాటల గారడీకి అడ్డుకట్టవేయలేమనీ తెలుసు. స్టూడియోలో నాలుగు గోడల మధ్య సుమ గల గల మంటూ ఎలా యాంకరింగ్ చేస్తుందో, వేలాదిమంది హాజరైన సినిమా వేడుకలకు కూడా అంతే అవలీలగా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. అదే సుమ గొప్పతనం .. అదే ఆమె ప్రత్యేకత.
బులితెరపై సుమ యాంకరింగ్ చేసిన కొన్ని షోలు .. వేలాది ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్నాయంటే, అది ఆమె గొప్పతనమేననే విషయాన్ని ఒప్పుకోక తప్పదు. వేడుక ఏదైనా ఆ వేదికపై సుమ ఉంటే ఆమెనే ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక వైపున నటిగా వరుస ధారావాహికలతో .. మరో వైపున యాంకర్ గా వరుస కార్యక్రమాలతో సుమ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే కథానాయికగాను అవకాశం ఆమె తలుపు తట్టింది. సుమ చురుకుదనం .. చలాకిదనం చూసిన దాసరి నారాయణరావు, ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో కథానాయికగా పరిచయం చేశారు. కథాకథనాల పరంగా ఆ సినిమా అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత కథానాయికగా తెరపై సుమ కనిపించలేదు.
కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు మళ్లీ చేస్తూ సమయాన్ని వృథా చేయకపోవడం సుమ తెలివితేటలకు నిదర్శనమనే చెప్పుకోవాలి. ఎప్పటిలానే తన సీరియల్స్ ను .. తన ప్రోగ్రామ్స్ ను చక్కబెడుతూ, అడపాదడపా మాత్రమే తెరపై మెరిసింది. తెలుగు సినిమాకి సంబంధించి ఒకానొకప్పుడు 100 రోజుల పండుగను మాత్రమే అభిమానుల సమక్షంలో జరిపేవారు. ఆ తరువాత ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ను .. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను భారీస్థాయిలో నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ తరహా ఈవెంట్స్ లోను సుమ తన ప్రత్యేకతను చాటుకుంది. వేదికముందు .. వేదికపైన ఎంతటి స్టార్స్ ఉన్నప్పటికీ ఆమెలో కాస్తైనా కంగారు కనిపించదు .. ఆవగింజంత ఆందోళనతో ఉన్నట్టుగాను అనిపించదు.
ఎలాంటి స్క్రిప్ట్ లేకుండానే ఎంతో ఆత్మస్థైర్యంతో ఆమె ఈవెంట్స్ ను నడిపించడం విశేషం. సాధారణంగా ఏదైనా ఒక సందర్భంలో పది మాటలు మాట్లాడితే, తెలియకుండానే ఎవరో ఒకరు నొచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ సుమ మాత్రం అనర్గళంగా మాట్లాడినా ఆ మాటల్లో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడుతూ ఉంటుంది. ఒకవేళ వేదికపై ఉన్నవారు ఎవరైనా పొరపాటుగా ఒక మాట జారితే, తన సమయస్ఫూర్తితో వెంటనే కవర్ చేస్తూ కామెడీ టచ్ ఇచ్చేసి హాయిగా నవ్వించేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తను వ్యాఖ్యాతగా వ్యవహరించే షో ఎలాంటి విమర్శలకు .. వివాదాలకు తెర తీయకుండా ఎంతో సమర్థవంతంగా నిర్వహించే నేర్పు .. నైపుణ్యం సుమ సొంతం.
కొత్తగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఏదో ఒక వేదికపై సుమ సందడి కనిపిస్తుంది .. టీవీ ఆన్ చేస్తే చాలు ఏదో ఒక ఛానల్ లో సుమ అల్లరి కనిపిస్తుంది. దీనిని బట్టి ఇన్నాళ్ల కెరియర్ లోను ఆమె ఎంత బిజీగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యలో చాలామంది అమ్మాయిలు ఎంతో ఉత్సాహంతో యాంకరింగ్ వైపు వచ్చారు .. ఉసూరుమనుకుంటూ వెళ్లారు. కానీ సుమ మాత్రం అప్పటికీ ఇప్పటికి అలాగే ఉంది. అందుకు కారణం ఆమెలోని చెరగని ఉత్సాహం .. తరగని సమయస్ఫూర్తి .. తనపై తనకి గల అచెంచలమైన ఆత్మవిశ్వాసం అని చెప్పక తప్పదు.
-పెద్దింటి గోపీకృష్ణ