(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఎక్కడైనా ప్రజలచేత ఎన్నుకోబడిన వ్యక్తే ఎమ్మెల్యే అవుతారు. ఆయనకు చెందిన పార్టీ అధికారంలో వున్నా లేకపోయినా ఆ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం అగ్ర తాంబూలం ఆయనదే అవుతుంది. ఆ నియోజకవర్గంలోని వివిధ అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఆ నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి పనులకు ప్రతిపాదనలు రూపొందిస్తారు. పధకాలు రచిస్తారు. వాటి అమలుకు తనదైన స్థాయిలో ప్రయత్నం చేస్తారు.
ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగే పద్ధతి. అయితే అందుకు విరుద్ధంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆ నియోజకవర్గంలో అంతా తానై, అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఆదేశాలు జారీ చేస్తున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అచ్చెన్నను అప్రతిష్ట పాలు చేసేందుకే..
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అప్రతిష్ట పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకమిదని తెలుగుదేశం వర్గాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. అచ్చెన్న ప్రాభవాన్ని తగ్గించేందుకు, ప్రజలలో ఆయనకున్న పట్టును సడలించేందుకు వైసీపీ ప్రభుత్వం పరోక్షంగా తన అభ్యర్థిని ఈ విధంగా ప్రోత్సహిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడకత్తెరలో అధికారులు
టెక్కలి నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్కలా’ తయారైందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిసినా, మాట్లాడినా, ఎటువంటి సమాచారం ఇచ్చినా సహించేది లేదని శ్రీనివాస్ ఆదేశిస్తుండగా , తాను పిలిచినప్పుడు వెళ్లకపోయినా, సమాచారం అందించకపోయినా , ఆయన ఆదేశాలను బేఖాతరు చేసిన అచ్చెన్న అగ్రహోదాగ్రుడు అవుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిమ్మాడలో కనిపిస్తే శంకరగిరిమాన్యాలే ..
అధికారులు ఎవరైనా నిమ్మాడ వెళ్లినా .. ఆ గ్రామంలో కనిపించినా, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిసినా శంకరగిరిమాన్యాలు పట్టిస్తామని, మా ఆదేశాలు బేఖాతరు చేసినవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని టెక్కలి వైసీపీ నాయకులు, ముఖ్యంగా శ్రీనివాస్ అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఇద్దరు వ్యవసాయ అధికారులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును నిమ్మాడలోని తన స్వగృహంలో కలియగా , అదేరోజు సాయంత్రం వారిని పిలిపించి శ్రీనివాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు స్థానిక అధికారులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. (ఇదీ చదవండి : అధికార్లకు బెదిరింపులు)
గుబులు రేపుతున్న గూఢచర్యం
అచ్చెన్నాయుడును ఎవరు కలుస్తున్నారు , ఎప్పుడు కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు అనే విషయాలపై వైసీపీ గూఢచర్యం నిర్వహిస్తోందని, అచ్చెన్నను ఎవరు, ఏ సమయంలో కలిసినా వైసీపీ నాయకులకు తెలిసిపోతుందని, వెంటనే అధినాయకుడు నుండి ఫోను వస్తుందని అధికారులు గుబులు చెందుతున్నారు.

వైసీపీ ఇన్చార్జులే పాలన సాగిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జీలు పాలన సాగిస్తున్నారని, జిల్లాలో వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారిక సమావేశాల్లో వారే పాల్గొంటున్నారని, ఇది మంచిదికాదని, జిల్లా ఉన్నతాధికారిగా ఇటువంటివి తక్షణమే అరికట్టాలని, పునరావృతం కాకుండా చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు గుండె లక్ష్మీ దేవి, బొగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, జిల్లా మాజీ అధ్యక్షురాలు గౌతు శిరీష తదితరులతో కలసి జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను మంగళవారం ఫిర్యాదు చేశారు.ఈ విపత్కర పరిస్థితి ఎటుదారితీస్తుందోనని అధికారులు, ఇంతకు ముందెన్నడూ లేని పరిస్థితి ఇప్పుడెందుకు దాపురించిందని స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.











