బాగ్యనగర వాసులను వరద నీటి సమస్యతో పాటు పేరుకుపోయిన మురుగు , చెత్త మరింత వేధిప్తోంది. ఓ వైపు భరించలేని దుర్గంధంతో పాటు అంటు వ్యాధుల భయంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరదల కారణంగా నగరంలోని కాలనీల్లో టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయింది. దీంతో తీవ్ర దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా అధికారులు ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపినా పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట పేరకు పోయిన చెత్త ఎప్పుడు తొలుగుతుందోనని అందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి చేరిన చెత్తను ఎలాగొలా శుభ్రం చేసుకున్నా వీధుల్లో పేరుకు పోయిన చెత్త, బురదతో సహవాసం తప్పటం లేదని అంటున్నారు.
ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం
హైదరాబాద్ నగరంలో నిత్యం 3వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్తను తొలగిస్తున్నట్టు బల్దియా అధికారులు చెబుతున్నారు. మూడు వెలకు పైగా ప్రాంతాల్లో చెత్తా , చెదారం పేరుకుపోయిందని … అన్ని ప్రాంతాలను మూడు రోజుల్లో క్లియర్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. వరదల కారణంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పేరుకు పోయిందని … ఎక్కవ చెత్త పేరుకుపోయిన 45 ప్రాంతలను గుర్తించిన బల్దియా యుద్ద ప్రాతిపదికన అక్కడ చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ లతో అదనపు వాహనాలతో చెత్తను తొలగిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే మిలియన్ టన్నుల మేర చేరిన చెత్తను ఏరి వేయాలంటే సమయం పడుతుందంటున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో వరద నీరు వస్తూనే ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహానికి అడ్డుకట్ట పడక సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
బస్తీల్లో ఇసుక ,బురద మేటలు…
మరో వైపు చెత్తా చెదారం ఏదో రకంగా ఎత్తివేసినా వరద కారణంగా కాలనీలు, బస్తీల్లో మేటలు వేసిన ఇసుక , బురద తరలింపు సక్రమంగా సాగటం లేదన్న విమర్శలొస్తున్నాయి. వాటిని వీలైనంత త్వరగా తొలగించక పోతే దోమలు ప్రబలి అంటు వ్యాదులు విజృంబించే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. దీంతో వాటిని సైతం యుద్దప్రాతిపదికన తొలగించేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాన్ని వరదలు ముంచెత్తగా , వాటిని ఎదుర్కునేందుకు గ్రేటర్ యంత్రాగం సిద్ధం కాక పోవడం , వరదలు తగ్గిన తరువాత చేపట్టిన కార్యక్రమాలు కూడ నత్తనడకన సాగుతుండటంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎన్నికల సమయంలో గల్లీ గల్లీలో ఇంటింటికి తిరిగే నేతలు ఇప్పుడు తమ వైపు ఎందుకు చూడటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ చేపట్టిన చెత్త తరలింపు కార్యక్రమం ఎప్పటికి ఒడిసేనో.. ప్రజల కష్టాలు ఎప్పుడు తొలగేనో వేచి చూడాలి.