టాలీవుడ్ లో రికార్డు స్థాయిలో శతాధిక చిత్రాలు తీసిన దర్శకుడిగా దాసరి నారా యణరావు పేరు చిరస్మరణీయం. ఆయన స్థాయిలో అత్యధిక చిత్రాల్ని తీయలేకపోయినా.. ఆయన శైలిని అనుసరించే దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఆయన శిష్యులు చాలా మంది దర్శకులుగా రాణించారు. మరికొందరు ఆయనకి ఏకలవ్య శిష్యులుగా ఉన్నారు. అలాంటి వారిలో మారుతి ఒకడు. నిజానికి మారుతి ఇంటిపేరు కూడా దాసరినే. అయితే టాలీవుడ్ లో దాసరి అంటే దాసరినారాయణరావు ఒకరే. అందుకే మా ఇంటిపేరు దాసరి అయినా.. నేను ఆ పేరుతో ఫోకస్ అవలేదు అని చెబుతుంటాడు.
ఆయన మీద అంతటి అభిమానాన్ని చాటుకొనే మారుతి .. భవిష్యత్తులో దాసరి బయోపిక్ తీసే ఆలోచన ఉందంటున్నాడు. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు ఆయన జీవిత చరిత్రను తెరమీద ఆవిష్కరిస్తానని అంటున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ ను ఎలా ప్లాన్ చేయాలి? సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని ఎవరి నియమించాలి అనే విషయంలో మారుతికి కొన్ని ఆలోచనలున్నాయట. కనీసం రెండేళ్ళయినా పట్టేలా ఉన్న దాసరి బయోపిక్ ను .. మారుతి ఏ మేరకు వర్కవుట్ చేస్తాడో చూడాలి.











