గత కొన్ని రోజులుగా తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం రేగింది. రెండు వర్గాలుగా ఆ పార్టీ నాయకులు చీలిపోయారు. ఒక వర్గం సీఎం పళనిస్వామికి మద్దతు తెలపగా మరికొందరు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వైపు నిలిచారు. ఇటీవలే చెన్నై లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలనుందని వార్తలు ప్రచారం జరిగాయి. రాజకీయ సంక్షోభానికి స్వస్తి పలకాలని పార్టీ పెద్దలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత సీఎం పళనిస్వామే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ సీఎం అభ్యర్థని పార్టీ ప్రకటించింది. పళనిస్వామి పేరును మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్వయంగా ప్రతిపాదించడంతో రాజకీయ సంక్షోభం సమసిపోయింది.
సంతకం చేసిన పన్నీర్ సెల్వం
ప్రస్తుత సీఎం పళనిస్వామే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ సీఎం అభ్యర్థని పన్నీర్ సెల్వం ఒప్పుకోవడం రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేసింది. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను ఇస్తామని చెప్పడంతో పన్నీర్ సెల్వం సైలెంట్ అయ్యారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఖరారు, పార్టీ ప్రణాళికల బాధ్యతలను పన్నీర్ సెల్వం తీసుకోనున్నట్లు సమాచారం. దీంతో పన్నీర్ సెల్వం సీఎం రేస్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరునేతలూ సంతకాలు చేశారు. ఆపై 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉండాలని కూడా ఇద్దరు నేతలూ ఒప్పందానికి వచ్చారు. దీంతో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటి వరకు నడిచిన వివాదానికి తెరపడింది. కీలక నాయకులు పార్టీ బాధ్యతలు తీసుకోవడంతో ఇంకెవరూ పోటీకి ముందుకు రాలేదు.
శశికళ ఎఫెక్ట్
‘అమ్మ’ జయలలిత అన్నాడీఎంకే పార్టీని 2012, 2016లలో వరుసగా అధికారంలోకి తీసుకువచ్చారు. రెండోసారి అధికారం లోకి రాగానే జయలలిత అనారోగ్య కారణాలతో మరణించారు. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. పన్నీర్ సెల్వం ఓ వర్గంగా, జయలలిత ‘నిచ్చెలి’ శశికళ మరో వర్గంగా విడిపోయారు. మెజారిటీ సభ్యులు తమ వెంట ఉన్నారనే ఉద్దేశంతో శశికళ సీఎంగా కావాలని ప్రయత్నించారు. ఎప్పటి నుంచో అక్రమాస్తుల కేసులో విచారణ ఎదురుకుంటున్నారు. ఆ కేసులో ఆమెను ముద్దాయిగా నిర్దారిస్తూ కర్ణాటక కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఆమెను బెంగళూరు, పరప్పన అగ్రహారం జైలుకి తరలించారు. దీంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. కానీ ఆమె పట్టువదలకుండా తమ ప్రధాన అనుచరుడు పళనిస్వామిని సీఎంగా చేయలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె 2021 జనవరిలో విడుదల కానున్నారు. పార్టీ బాధ్యతలను ఆమె తన ఆధీనంలోకి తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే పన్నీర్ సెల్వం గత్యంతరం లేక పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
బీజేపీ రాజకీయం
సౌత్ లో కర్ణాటక తప్పా బీజేపీ మిగతా రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. దీంతో త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక ద్రుష్టి సారించింది. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరిపిన బీజేపీ మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ చర్చలు జరిపినట్లు వార్తలు వినబడుతున్నాయి. శశికళను కూడా జైలు నుంచి విడుదల చేయడంలో కూడా బీజేపీ పాత్ర ఉందంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఎన్నికలలో వీరి సాయంతో తమిళనాడులో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుంది.
అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ వేస్తున్న ఎత్తులను ప్రతిపక్ష డీఎంకే కూటమి ఆసక్తిగా గమనిస్తోంది!











