కలియుగ దాన కర్ణుడు సోనూ సూద్ కు ఇప్పుడు నటన మీద కన్నా సాయం చేయడం మీదే ఎక్కువ దృష్టి ఉన్నట్టుంది. కరోనాకు ముందు వరకూ సోనూలోని ఈ కోణం భయటపడలేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సోనూ బయట తిరుగుతూ తన వంతు పాత్ర పోషించే సరికి ఆయన ఒక్కసారిగా జనం దృష్టిలో హీరో అయిపోయారు. అంతేకాదు ఆయన మొదట్నుంచీ సామాజిక మాధ్యమాల్లో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఆయన ట్వట్టర్ అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూసేవారూ చాలామంది ఉన్నారు. ఇటీవల ఎన్డీటీవీ ఓ కథనం ప్రసారం చేసింది.
దేశంలో మూడు లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారనేది ఆ కథనం సారాంశం. దీన్ని చూసిన వెంటనే సోనూ స్పందించారు. ఫీజులు కట్టలేదని మన దేశంలో ఒక్క విద్యార్థి చదువు కూడా ఆగిపోకూడదు అని సోనూ ఈరోజు ట్వీట్ చేశారు. శుభమ్ విజయ్ వర్గీయ అనే మరో వ్యక్తి నుంచి ఇంకో వినతి వచ్చింది. ‘సోనూసూద్ సర్.. నేను ఇప్పుడు రోజుకు 35 మంది విద్యార్థులకు బోధిస్తున్నాను. మేము వారికి స్టేషనరీలాంటి మేం ఇచ్చాం. కాని విద్యార్థులకు పుస్తకాలు లేవు. 35 మందికి వారి కోర్సు పుస్తకాలను అందించవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది వారికి ఎంతో సాయపడుతుంది’ ఆయన ట్వట్టర్ ద్వారా సోనూను కోరారు.
‘ఈ వారంలోనే విద్యార్థులందరికీ పుస్తకాలు చేరతాయి. ఇంకా ఏమైనా అవసరమైతే మాకు తెలపండి ’అంటూ సోనూ కూడా బదులిచ్చారు. కొందరు నటులుగాని, రాజకీయ నాయకులుగాని వెంటనే స్పందించరు. సోనూ అందుకు భిన్నం.. అది ఎలాంటి ప్రతిపాదన అయినా వెంటనే స్పందించి బదులిస్తారు. అందుకే సూనూ సూద్ ఔదార్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఒకటా రెండా ప్రతిరోజూ ఏదో ఒక సాయం అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన సాయానికి మరో మచ్చుతునక ఓ సినిమా మేనేజర్ విషయంలోనూ జరిగింది. ఈ లాక్ డౌన్ హీరోకు ప్రతిరోజూ ట్వట్టర్ లో ప్రతిరోజూ అనేక వినతులు వస్తున్నాయి. కొన్నిటికి ఆయన ఓర్పుగా సమాధానాలిస్తూనే సాయం విషయంలో నేర్పును కూడా ప్రదర్శిస్తున్నారు. తను చేసే సాయం దుర్వినియోగం కాకూడదనేది ఆయన ఉద్ధేశం.
ఇప్పటిదాకా ఆయన ముక్కూమొహం కూడా తెలియని వారికి కూడా సాయం చేస్తూ వచ్చారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ మేనేజర్ కు వచ్చిన ఇబ్బంది ఆయన దృష్టికి వచ్చింది. తమ కుమారుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని, తనకు సహాయం చేయాల్సిందిగా ఆ మేనేజర్ కోరాడు. వెంటనే సోనూ స్పందించి ఆ కుర్రాడి హార్ట్ ఆపరేషన్ కు కావలసిన ఏర్పాట్లను వెనువెంటనే చేసేశారు. ఆ మేనేజర్ ట్వీట్ సారాంశం ఏమిటంటే తన పేరు ఎంవీ సుబ్బారావని, తన కుమారుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉండటంవల్ల సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారని, తన దగ్గర అంత డబ్బులేదని ఆయన ట్విట్టర్ లో కోరారు. ఇలాంటి వాటికి ఎంత వేగంగా స్పందించాలో సోనూకు బాగా తెలుసు. దటీజ్ సోనూ సూద్.











