తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధుల ముందు ఫేక్ వీడియో ప్రదర్శించారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో భాగంగా టీడీపీ సీనియర్ నేత దేవినేని రెండో సారి మంగళగిరి సీఐడీ కార్యాలయంలో హాజరయ్యారు.చంద్రబాబు పేరు చెప్పాలని సీఐడి అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని దేవినేని మీడియాకు వెల్లడించారు. యూట్యూబులో ఫసక్ అని సెర్చ్ కొడితే ఆ వీడియో వచ్చిందని, తిరుపతిలో ఆ వీడియోనే తాను ప్లే చేశానని సీఐడీ అధికారులకు దేవినేని ఉమ చెప్పారు. అధికారులు ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. కావాలంటే ఇప్పుడు కూడా ఫసక్ అని యూట్యూబులో సెర్చ్ చేసి చూడాలని దేవినేని సీఐడి అధికారులను కోరికట్టు సమాచారం.
ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం..
శనివారం ఉదయం పది గంటలకు మంగళగిరి సీఐడీ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమను సాయంత్రం 8 గంటల వరకు అధికారులు ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్పాలని అధికారులు ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆయన మరోసారి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 4న మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు తెలిపారు. దీనికి దేవినేని అంగీకరించారు.అక్రమ కేసులకు భయపడేది లేదని, వైసీపీ నేతల అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలులో రైతులను వైసీపీ నాయకులు రూ.3000 కోట్లు మోసం చేశారని, క్వింటా ధాన్యం కనీసం రూ.900లకు కూడా కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నారని దేవినేని ఆరోపించారు.
Must Read ;- దేనికైనా రెడీ : రైతుల కోసం జైలుకెళ్లడానికి సిద్ధమే!











