ప్రకాశం జిల్లా వైసీపీలో తలెత్తుతున్న వివాదాలు ఆ పార్టీ అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నాయి. పార్టీలో ఇప్పటికే కరణం బలరాం, ఆమంచి, బాలినేని, పోతుల సునీత, పాలేటి రామారావుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అధిష్టానం పిలిచి మాట్లాడినా అప్పటికప్పుడు సైలెంట్ అవుతున్నా..మళ్లీ ఎక్కడికక్కద ఆదిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఇక తాజాగా అదే జిల్లాలో వైసీపీకి మరో టెన్షన్ మొదలైంది.
Magunta Sreenivasulu Reddy :
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొన్నాళ్లుగా చాలా సైలెంట్ అయిపోయారు. ఒంగోలు ఎంపీగా గెలిచిన తరువాత..కొన్నాళ్లు యాక్టీవ్‌గానే ఉన్నా.. తరువాత సైలెంట్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పదనట్లు పాల్గొన్నారని ఆ పార్టీ నాయకులే చెబుతుండడం ఇందుకు నిదర్శనం. తన పార్లమెంటు నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించాలని ఇటీవల సీఎం జగన్‌ను కలిశారు ఒంగోలు ఎంపీ మాగుంట. అయితే ఈ సందర్భంగా మరో అంశం కూడా చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. తాను చెన్నైలో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
ఈ కారణాలేనా..
గతంలో టీడీపీలో ఉండి..వైసీపీకి వచ్చిన మాగుంట 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే మాగుంట శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్ దక్కింది. గెలిచాక కొన్ని రోజులు యాక్టీవ్‌గానే ఉన్నా తరవాత సైలెంట్ అయ్యారు. అందుకు మూడు కారణాలను పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆర్థిక కారణాలు ఒకటైతే.. తాను ఎంపీగా ఉన్నా.. తన నియోజకవర్గ పరిధిలో జగన్ బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, బాలినేనిల ఆధిపత్యమే నడుస్తోందనే అభిప్రాయం కూడా ఉందని చెబుతున్నారు. మూడోది దగ్గుబాటికి టిక్కెట్ హామీ అంశం కూడా ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది.
ఏపీలో లిక్కర్ పాలసీతో ఇబ్బందులు
ఆర్థిక అంశానికి వచ్చేటప్పటికి తొలుత వ్యాపారవేత్త అయిన మాగుంట గతంలో కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సమయంలోనూ ఆల్కాహాల్ తయారీ కంపెనీలున్నాయి. నెల్లూరు జిల్లాతోపాటు చెన్నై కేంద్రంగా కంపెనీలున్నాయి. కింగ్ ఫిషర్‌తో పాటు కంపెనీలకు సరఫరా చేసేవారు. తరువాతి కాలంలో లిక్కర్ తయారీ కూడా మొదలుపెట్టారు. తమిళనాడులో ఎక్కువగా విక్రయిస్తుంటారు. అయితే ఏపీలో ప్రస్తుతం లిక్కర్ పాలసీతో తానుకూడా ఇబ్బంది పడుతున్నానని, బకాయిలు కూడా వసూలు చేసుకోలేకపోతున్నానని, తన కంపెనీ బ్రాండ్‌లతో పాటు తన భాగస్వాముల అనుబంధ కంపెనీల బ్రాండ్‌లపై నిషేధం విధించారని, రానున్న కాలంలో ఇలాగే కొనసాగితే భారీగా నష్టపోతానని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇటీవల స్థానికంగా ఉండడం లేదని, చెన్నైలో కొన్నిరోజులు, నియోజకవర్గంలో కొన్ని రోజులు ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇక ఆధిపత్యపోరు విషయానికి వస్తే..
గతంలో కాంగ్రెస్‌లో ఉండి టీడీపీకి వచ్చారు మాగుంట. 2014 ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీచేసి ఓడారు. ఆయనకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అప్పట్లో ఒంగోలు టిక్కెట్ విషయంలో జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు తలెత్తాయి. ఒంగోలు టిక్కెట్ ను ఆశించిన వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీలోకి మాగంట రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఒంగోలు ఎంపీ టిక్కెట్ మాగుంటకు దక్కింది. ఆయన టీడీపీ అభ్యర్థి, మంత్రి సిద్ధా రాఘవరావుపై గెలిచారు. తరువాతే పరిణామాలు మారిపోయాయి. నియోజకవర్గంలో జగన్‌కు బంధువైన బాలినేని జోక్యం కూడా ఎక్కువైందనే అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఓవైపు బాలినేని, మరోవైపు వైసీ సుబ్బారెడ్డిలు ఉండడం, వారి పెత్తనమే నడుస్తుండడంతో తాను సైడ్ అయిపోవడం బెటర్ అనే ఆలోచనతో ఉన్నట్లు గెలుస్తోంది.
దగ్గుబాటికి జగన్ హామీ
ఇక మూడో అంశానికి వస్తే.. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గతంలో జగన్ ఓ హామీ ఇచ్చారట. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి లేదా ఆయన కుమారుడు హితేష్‌కి ఎంపీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారట. హితేష్‌కి సంబంధించి పౌరసత్వ అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో క్లారిటీ రాలేదని, ఒక వేళ ఆ క్లారిటీ వస్తే.. వారు వైసీపీలో మళ్లీ యాక్టీవ్ అయితే తనకు మరింత ఇబ్బంది అవుతుందని మాగుంట భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యాక్టీవ్‌గా ఉండి ఇబ్బంది పడే కంటే..సైలెంట్‌గా ఉండడం ప్రస్తుతం అవసరమని భావించినట్టు తెలుస్తోంది.
Must Read ;- పదేళ్లుగా వైసీపీ జెండా మోసినా ఫలితం లేదు.. చంద్రబాబును కలసిన రాయచోటి నేత రాంప్రసాద్ రెడ్డి