తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు సినీ పరిశ్రమకు ప్రకటించిన వరాలకు స్పందించని వారంటూ లేరు. సీఎం కేసీఆర్ ఇంద్రుడు, చంద్రుడు అంటూ నిన్న సాయంత్రం నుంచి ట్విట్టర్ హోరెత్తిపోతోంది.
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎస్.ఎస్. రాజమౌళి దాకా కేసీఆర్ వరాలకు జేజేలు పలికారు. రేపటి నుంచే మనం సినిమా థియేటర్లకు వెళ్లిపోవచ్చు అన్నంతగా ప్రచారం మాత్రం జరిగిపోయింది. వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే మాత్రం అంతా శూన్యంగానే కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన వరాలను తప్పుబట్టలేం.. మన సినిమా జవరాలు అందుకు సిద్ధంగా ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకాంశం. సినిమాల విడుదలకు నిర్మాతలంతా క్యూ కట్టేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే.
నిజానికి తమ సినిమాను ఇప్పటికిప్పుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రొడ్యూసర్లు ఎవరూ కనిపించడం లేదు. అసలు విడుదల చేయడానికి ఎన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి అని లెక్క తీస్తే ఒకటీ అరా మినహా కనిపించడం లేదు. కొందరు నిర్మాతలు అప్పుల పాలై వీధిన పడితే, ఇంకొందరు ఇతర వ్యాపాలతో బిజీగా మారిపోయారు. ఇంకొందరు చిన్న చితకా వెబ్ సిరీస్ లాంటివి చేసుకుంటున్నారు.
దేవుడు వరమిచ్చినా..
దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదని అంటూ ఉంటారు. మన సినిమాలకు కూడా అది వర్తిస్తుంది. ఎగ్జిబిటర్లను అన్ని విధాలా ఆదుకోడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తూనే ఉన్నా పెద్దల మద్దతు మాత్రం వారికి లేదు. ఇన్నాళ్లూ మనకు వెన్నుదన్నుగా నిలిచిన ఎగ్జిబిటర్లను ఆదుకోక పోగా ఓటీటీ మార్కెట్ అందుబాటులో ఉండటంతో అటు పరుగులు పెట్టారు. ఎవరి సుఖం వారు చూసుకోవడం తప్పు కాదుగానీ నమ్ముకున్న వారిని నట్టేట ముంచడాన్ని ఎగ్జిబిట్లర్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు థియేటర్లను బతికించాల్సింది ప్రభుత్వమూ, ప్రేక్షకులూ కాదు.. మన సినిమా పెద్దలే.
చిన్న సినిమాకు మంచి జరగాలంటే..
చిన్న సినిమాను బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షూటింగులో ఉన్న పెద్ద సినిమాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. సినిమా ఇండస్ట్రీని బతికిస్తున్నది మాత్రం చిన్న సినిమానే. ఇది కాదనలేని వాస్తవం. వీటిలో చాలావరకు రిలీజ్ కాకుండానే ఆగిపోతుంటాయి. అందుకు రకరకాల సమస్యలు ఉంటాయి. ఇలాంటి చిన్న సినిమాకి మేలు జరగాలంటే 100 థియేటర్ల లోపు సినిమా విడుదలైతే టాక్స్ మినహాయింపు ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఇండస్ట్రీ వర్గాల నుంచి ఉంది.
ఇలా చేయడం వల్ల చిన్న సినిమాల విడుదలకు మంచి అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఒకవేళ సినిమా హిట్ అయ్యిందనుకోండి.. అప్పుడు థియేటర్లను పెంచుకోవచ్చు. తద్వారా టాక్స్ కూడా కట్టొచ్చు. సినిమా 100 థియేటర్లకు పైన విడుదలైతే 18 శాతం పన్ను, 500 థియేటర్ల పైన అయితే ఇంకా పన్ను పెంచుకోవచ్చనే అభిప్రాయం ఉంది. ఇలా టాక్స్ విధానం ఉంటే 1000 థియేటర్లలో సినిమా రిలీజైన వాళ్లకు ఎలాంటి సమస్యా ఉండదు.
Must Read ;- బల్దియా కావాలంటే.. కేసీఆర్ మెట్లు దిగక తప్పదు!











